ముచ్చింతల్‌: చినజీయర్‌ వద్దకు జగన్..!

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌లో రామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రధాని ప్రాంభించిన సమతామూర్తి దర్శనానికి ప్రముఖులు క్యూ కడుతున్నారు. సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు దర్శించుకోగా.. ఇవాళ ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ముచ్చింతల్‌కు రానున్నారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి ముచ్చింతల్‌ లో త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో ఇవాళ పాల్గొంటారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమతా మూర్తి ప్రాంగణమంతా కలియ తిరుగుతారు. సమతామూర్తి విగ్రహ విశేషాలు తెలుసుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది వేడుకలు ఇవాళ ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ ఆరో రోజు మొదటగా దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టి యాగం చేస్తారు. ఆ తర్వాత వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ జరుగుతుంది. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రముఖులచే ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి.

ఇప్పటికే సమతామూర్తి దర్శనానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. గతంలోనే కేసీఆర్ తరచూ ఇక్కడికి రాగా.. మొన్న ఏకంగా ప్రధాని దీనిని ప్రారంభించారు. నిన్న పవన్ కల్యాణ్‌ కూడా సమతామూర్తిని దర్శించుకున్నారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తిని నిన్న పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జస్టిస్‌ పొనుగంటి నవీన్‌రావు, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘుపతి, జనసేన వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, మాజీ డీజీపీ అరవింద్‌రావు, టిటిడీ ఈవో జవహర్‌రెడ్డి దర్శించుకున్నారు. అలాగే ఈ నెల 8న కేంద్ర మంత్రి అమిత్‌షా సమతామూర్తి కేంద్రానికి రానున్నారు. ఆ తర్వాత ఈనెల  9న ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌, 10న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాబోతున్నారు. ఈనెల 11న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, 12న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చే అవకాశం ఉంది. ఈనెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: