గోదావరి : పవన్ పై బాగా ఒత్తిడి పెరిగిపోతోందా ?
సినిమా షూటింగులతో ఫుల్లు బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బాగా ఒత్తిడి పెరిగిపోతోందట. ఏ విషయంలో అంటే జనసేన పార్టీని జనాల్లో తీసుకెళ్ళే విషయంలోనట. అంటే ఇపుడు పార్టీ జనాల్లో లేదా ? అంటే ఉందంటే ఉంది లేదంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ తరపున ఏదైనా కార్యక్రమానికి పిలుపిచ్చినపుడు పవన్ పాల్గొంటేనేమో ప్రచారం వస్తోంది. పవన్ పాల్గొనకపోతే అసలు ఆ కార్యక్రమాన్ని పట్టించుకోవటమే లేదు.
ఇపుడు విషయం ఏమిటంటే పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళటమంటే పార్టీ ఆఫీసుల్లోనో, ట్విట్టర్లోనో లేకపోతే మీడియా సమావేశంలో మాట్లాడటం కాదట. ఏకంగా పాదయాత్ర చేయాలని పవన్ పై నేతలు కొందరు గట్టిగా చెబుతున్నారట. ఏపీలో పాదయాత్రకు ఉన్న సెంటిమెంటు మరిదేనికీ లేదని కొందరు నేతలు పదే పదే పవన్ కు చెబుతున్నారట. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డిని ఉదాహరణగా చూపుతున్నారట.
యాధృచ్చికమో ఏమోగానీ పై ముగ్గురు పాదయాత్ర చేసిన తర్వాత ముఖ్యమంత్రులయ్యారు. దాంతో ఏపీలో ముఖ్యమంత్రులు కావాలంటే పాదయాత్ర చేయాలనే చర్చ బలంగా ఉంది. అందుకనే జనసేనలోని కొందరు నేతలు పవన్ను పాదయాత్ర చేయమని గట్టిగా చెబుతున్నారట. అయితే పవన్ కేమో పాదయాత్ర చేయటం ఏమాత్రం ఇష్టంలేదు. పాదయాత్ర విషయంలో గతంలోనే పవన్ క్లారిటి ఇచ్చారు. తాను పాదయాత్ర పేరుతో రోడ్లపైకి వస్తే లక్షలాది మంది అభిమానులు రోడ్డుపైకి వచ్చేస్తారు కాబట్టి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పారు.
పవన్ చెప్పిన కారణం కరెక్టేనా లేకపోతే ఇంకేదైనా ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయిలేండి. పాదయాత్ర చేయాలంటే ఎంతో ఓపికుండాలి. పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి వేరే కార్యక్రమాలేవీ పెట్టుకునేందుకు లేదు. నాలుగు రోజులు పాదయాత్ర చేయటం మూడు రోజులు అడ్రస్ లేకుండా పోతే జనాల్లో పలుచనైపోతారు. పవన్ ఏమో సినిమాల్లో ఫుల్లు బిజీగా ఉన్నారు. పాదయాత్ర పెట్టుకుంటే కనీసం ఏడాదిపాటు ఇక షూటింగులేవీ పెట్టుకునేందుకు లేదు. మరి ఈ పరిస్ధితుల్లో చివరకు పవన్ ఏమి చేస్తారో చూడాలి.