గుంటూరు : ఈ ఎంపీకి ఏమైంది ?
అధికార వైసీపీ ఎంపీల్లో అందరికన్నా ఎక్కువ వార్తల్లో నిలుస్తున్న ప్రజా ప్రతినిధి ఎవరైనా ఉన్నారా అంటే అది బాపట్ల ఎంపి నందిగం సురేష్ అనే చెప్పాలి. కారణాలు తెలియటం లేదుకానీ రెగ్యులర్ గా వివాదాల్లో ఎంపి పేరు వినిపిస్తునే ఉంటుంది. నిజానికి సురేష్ బ్యాగ్రౌండ్ చాలా చాలా సామాన్యమైనది. రాజధాని ప్రాంతమైన తుళ్ళూరు మండలంలో ఆయన సొంతూరుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సురేష్ ను బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఏరికోరి పోటీచేయించారు.
జగన్ గాలిలో సురేష్ కూడా మంచి మెజారిటితోనే గెలిచారు. అయితే గెలిచిన దగ్గర నుండి ప్రతిరోజు ఏదో ఒక వివాదం ఆయన్ను చుట్టుముడుతునే ఉంది. తాజాగా చేబ్రోలు మండలంలోని శేకూరులో దళితుల్లోనే రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ఎంపీ పేరు బాగా నానుతోంది. శేకూరులోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒకవర్గంలోని వాళ్ళు మద్యం తీసుకున్నారు. దీన్ని ఇంకోవర్గం అభ్యంతరం చెప్పింది. దాంతో రెండు వర్గాల మధ్య వివాదం మొదలై పెద్దదయ్యింది. చివరకు పోలీసుస్టేషన్ దాకా వెళ్ళింది.
ఇదే విషయమై పంచాయితికి రమ్మని రెండు వర్గాలను కబురుపంపిన ఎంపి ఒక వర్గంపై దాడి చేశారని ప్రచారం జరుగుతోంది. దాంతో ఇపుడు చేబ్రోలు మండలంలో ఎంపికి వ్యతిరేకంగా గోల మొదలైంది. అంతకుముందు కూడా ఇలాంటి వివాదాలు ఎంపీ చుట్టూ చాలానే కమ్ముకున్నాయి. ఇక తాడేపల్లి ఎంఎల్ఏ శ్రీదేవితో ఇసుక పంచాయితీలు కూడా చాలానే ఉన్నాయి. అలాగే నియోజకవర్గంలోని ఒకవర్గంతోనే ఎంపీ బాగా సఖ్యతగా ఉంటారని, వాళ్ళు ఎంత కంపు చేస్తున్నా వాళ్ళకే మద్దతుగా నిలుస్తారనే ఆరోపణలున్నాయి.
ఎంపీని అడిగితేనేమో తనకు ఎవరితోను పంచాయితీలు లేవంటారు. ఎల్లోమీడియా కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తోందంటు మండిపోతున్నారు. విషయం ఏదైనా సురేష్ బ్యాగ్రౌండ్ ఒక వ్యవసాయ కూలి. వైసీపీకి స్ట్రాంగ్ సపోర్టర్. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి ప్రాంతంలో పంటలు తగలబడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఘటనలో పోలీసులు తీసుకెళ్ళి బాగా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జరిగిన ఘటనల నేపధ్యంలో జగన్ దృష్టిలో పడ్డారు.
అప్పటి నుండి సురేష్ దశమారిపోయింది. తర్వాత ఎన్నికల్లో ఏకంగా ఎంపీ అయిపోయారు. దాంతో వ్యవహార శైలిలో బాగా మార్పు వచ్చేసిందని పార్టీలోనే చెబుతున్నారు. చిన్న వయసులోనే ఎంపీ అయిన సురేష్ దీన్ని కాపాడుకోవాల్సిందిపోయి చెడగొట్టుకుంటున్నారని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. ఏదేమైనా సురేష్ మాత్రం రెగ్యులర్ గా వివాదాల్లో నిలుస్తుండటం వాస్తవం.