ఒకప్పుడు వ్యవసాయ అధికారి ఎక్కడుంటాడో తెలిసేది కాదు. ఏదైనా సమస్య వస్తే ఎవరిని కలువాలో, ఎక్కడ కలువాలో తెలిసేది కాదు. ఇదంతా గతం. కానీ ఇప్పుడు వ్యవసాయ అధికారి ఎక్కడున్నడని అడిగితే.. రైతువేదికలో అనే సమాధానం వినిపిస్తున్నది. సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే.. రైతువేదికలో అని వినవస్తున్నది. రైతులను సంఘటితం చేయాలనే ప్రభుత్వం ఆలోచన.. కార్యరూపం దాల్చుతున్నది. రూ.572.88 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతువేదికలను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ విధంగా రైతులను సంఘటితం చేసేందుకు రైతువేదికలను నిర్మించడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం.
గతంలో సాగుపై రైతులకు సూచనలు ఇచ్చేవారే కరువు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామానికో ఏఈవోను ప్రభుత్వం నియమించింది. దీం తో సాగు లో ఎలాంటి సందేహం వచ్చినా ఏఈవోను సంప్రదించి పరిష్కరించుకొనే అవకాశం లభించింది. రైతువేదికలను వేదికగా చేసుకొని రైతులు, అధికారులు పంటల సాగుపై సమాలోచనలు చేస్తున్నారు. ఎలాంటి పంటలు వేయాలి ? ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ? ఏ పంట కు డిమాండ్ ఉన్నది ? ఏ విత్తనాలు బాగుంటాయి? వంటి అంశాలపై ఏఈవోలతో చర్చించి రైతులు నిర్ణయం తీసుకొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం అనాలోచిత వైఖరితో రైతులను వరి సాగు చేయొద్దని చెప్తున్నది. ఈ నేపథ్యంలో రైతులకు ఇతర పంటల సాగు అనివార్యంగా మారింది. ఈ క్రమంలో ఇతర పంటల సాగుపై రైతువేదికల్లో అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగుతున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతువేదికలు లేకుంటే తామంతా ఆగమయ్యే వాళ్లమని, ఏ పంటలు వేయాలో తేల్చుకోలేకపోయేవాళ్లమని రైతులు చెప్తున్నారు. ఇప్పటివరకు రైతువేదికల్లో సుమారు 17 వేలకు పైగా సమావేశాలు నిర్వహించడం విశేషం. ఇలాంటి రైతు వేదికలు.. తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎంతో సహకారంగానే ఉంటున్నాయని రైతులే చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో రావాలని కొరతున్నారు రైతులు.