ఏపీ డిజిపి కి చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ

Veldandi Saikiran
అమరావతి : కుప్పంలో ఐటీడీపీ కార్యకర్త  మురళిపై దాడి చేశారంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కి  తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు బహిరంగ  లేఖ రాశారు. ఐటీడీపీ కార్యకర్త మురళీ ని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారని.. మురళీ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు.  శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని... ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు.  దోషులపై చర్యలు తీసుకోవాలని.. టీడీపీ  సానుభూతిపరులపై పదే పదే హింసాత్మక దాడులు జరుగుతున్నప్పటికీ , దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. 

 వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతుకను నొక్కేస్తున్నారని.. కుప్పం ఐటీడీపీ క్రియాశీల సభ్యుడు  మురళిని 20 డిసెంబర్ 2021 మధ్యాహ్నం 1.55 గంటలకు వైసీపీ నేతలు కుప్పంలో కిడ్నాప్ చేశారని అగ్రహించారు చంద్రబాబు నాయుడు.  మురళిని నేరుగా రెస్కో చైర్‌పర్సన్ జిఎస్ సెంధిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని.. మురళికి కుడి కన్ను దగ్గర అతని ముఖం మీద గాయాలయ్యాయని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.  20 డిసెంబర్ సాయంత్రం 6.30 గంటల సమయంలో సెంధిల్ కుమార్ ఇంటి నుండి రెండు కార్లు,   రెండు బైక్‌లలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, కొట్టారని...  వైసీపీ నేతల బెదిరింపు కారణంగా మురళి భయపడి 23 డిసెంబర్ 2021 వరకు ఈ ఘోరమైన సంఘటనను నివేదించలేదని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు.  భవిష్యత్తులో  మురళిపై ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని.. ఘటన పై పోలీసులు విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. మురళికి భద్రత కల్పించడానికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు చంద్రబాబు నాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: