హైదరాబాద్ : కేసీయార్ సంచలన నిర్ణయం ?
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎంఎల్ఏలకు కేసీయార్ ఛాన్సు ఇవ్వదలచుకోలేదని సమాచారం. చాలామంది ఎంఎల్ఏలపై జనాల్లో బాగా వ్యతిరేకత కనిపిస్తోందని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఎంఎల్ఏల మీద ఉన్న వ్యతిరేకత అంతా పార్టీపైన అంతిమంగా ప్రభుత్వం పైన పడకుండా ఉండాలంటే వాళ్ళను మార్చాల్సిందే అని కేసీయార్ గట్టిగా డిసైడ్ అయ్యారట. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కనీసం 40 మంది ఎంఎల్ఏలకు టికెట్లు దక్కవనే టాక్ నడుస్తోంది.
టికెట్లు దక్కటం కష్టమనే ఎంఎల్ఏల పేర్లు బయటకు రావటంలేదు కానీ సంఖ్యమాత్రం బాగానే చక్కర్లు కొడుతోంది. 40 నియోజకవర్గాల్లో కొత్తవారికి అందులోను యువతకు అవకాశాలు ఇవ్వాలని సీఎం అనుకుంటున్నారట. ఎప్పుడైతే 40 మందికి టికెట్లు దక్కవనే ప్రచారం మొదలైందో వెంటనే ఆ జాబితాలో ఉండేదెవరో అనే చర్చ పార్టీలో బాగా జరుగుతోంది. కొందరు ఎంఎల్ఏలైతే రెగ్యులర్ గా పార్టీ ఆఫీసుకొచ్చి తమకున్న మార్గాల్లో సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు, చర్చలను బీజేపీ నేతలు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు.
ఈ విషయం ఇలాగుంటే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు కేసీయార్ రెడీ అవుతున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ నేతలతో చెప్పినట్లు సమాచారం. షాతో బీజేపీ నేతలు సమావేశం అయిన సందర్భంగానే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందని హెచ్చరించటం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇదే విషయాన్ని స్వయంగా అమిత్ షా చెప్పటమే కాస్త ఆశ్చర్యంగా ఉంది.