చంద్రబాబుకు సీమలో మరో చిక్కొచ్చి పడిందే...!
పైగా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోనే పాదయాత్ర సాగుతున్నా.. ఆ పార్టీ నేతలు.. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న నాయకులు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. తాజాగా రాయలసీమ మేధావుల ఫోరం టీడీపీని టార్గెట్ చేసింది. ఇప్పటికే రెండు సార్లు రాజధానిని కోల్పోయిన సీమ ప్రజలు ఇప్పుడు పోరాడకపోతే పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని హెచ్చరించింది.
కమిటీల నివేదికలను గతంలో అదికారంలో ఉన్న చంద్రబాబు తుంగలో తొక్కి ఏకపక్షంగా రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని విమర్శించింది. అంతేకాదు, శ్రీశైలం ప్రాజెక్టు కోసం 80 వేల ఎకరాలను ఇచ్చిన రాయలసీమ రైతులది త్యాగమా ? లేక తమ స్వార్థం కోసం భూములిచ్చి కౌలు, రుణమాఫీ, ఇతర ప్రయోజనాలు పొందుతున్న అమరావతి వాసులది త్యాగమా ? అని ప్రశ్నించడం గమనార్హం.
సొంతగడ్డకు నష్టం జరగాలని కోరుకుంటున్న వారికి కొందరు రాయల సీమ నేతలు మద్దతు పలకడం బాధాకరమన్నారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధి నినాదంతో తిరుపతిలో 17న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే.. అదే రోజు పాదయాత్ర చేస్తున్న రైతులు కూడా బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దీంతో రెండు పక్కల టీడీపీకి ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా.. ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అటు సొంత జిల్లా నుంచి వ్యతిరేకత వస్తుండడం ఇటు.. అమరావతి విషయం ముడిపడకపోవడం.. వంటివి ఇబ్బందిగానే పరిణమించాయని అంటున్నారు పరిశీలకులు.