కుప్పం టీడీపీ : ధైర్యే సాహసే చంద్రబాబు..!
ఇప్పుడంతా వైసీపీదే రాజ్యం. వైసీపీ అడుగు పెట్టిన చోట టీడీపీ నిలదొక్కుకోలేకపోతోంది. జగన్ పట్టుదల కారణంగా ఎక్కడిక్కడ టీడీపీ చతికిలబడిపోతోంది. ఉన్న నాయకులెవ్వరూ పార్టీ తరఫున క్రియాశీలక రాజకీయాలు నెరపడం లేదు. అంతర్గత కలహాలు కారణంగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న ఆదేశాలు కానీ ఆయన నాయకత్వం కానీ పెద్దగా ప్రభావితం చేయడం లేదు. అసలు ఆయనకు మద్దతు ఇచ్చే వారే కరవవుతున్నారు. ముఖ్యంగా సీనియర్లు కొందరు అచ్చెన్న నాయకత్వాన్ని సమర్థించేందుకే అంగీకారం తెలపడం లేదు. ఇదే సమయంలో లోకేశ్ కాన్వాయ్ కాస్త సమస్యాత్మక ప్రాంతాలలో తిరుగుతున్నా ఆయనకూ పెద్దగా మద్దతు దక్కడం లేదు. ప్రజల నుంచి కొన్ని సందర్భాల్లో వస్తున్న స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ అవి దీర్ఘ కాలంలో పూర్తి స్థాయిలో ప్రభావం చూపేందుకు అవకాశమే లేకుండా పోతోంది. ఈ తరుణంలో కింది స్థాయి కార్యకర్తలు ఎవరికి వారు అన్న విధంగా విడిపోయారు.
కొందరు మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపినప్పటికీ అధికార పార్టీ మాత్రం కొందరి వలసలు ప్రోత్సహించడం లేదు. అంతేకాదు కొందరు అధికార పార్టీకి అనుబంధంగా పనిచేసినప్పటికీ అందుకు ఆధారాలు ఉన్నప్పటికీ చంద్రబాబు ఎవ్వరినీ ఏమీ అనలేకపోతున్నారు. కార్యకర్తలు సైతం కొందరు వైసీపీకి బాహాటంగానే మద్దతు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం ఓ అలవాటుగా మారిపోయిన సందర్భాన పార్టీ శ్రేణులు కొందరు అధికార పార్టీకి అనుబంధంగానే ఉన్నారు.
ఈ తరుణంలో ఒకడే ఒక్కడు చంద్రబాబు రాజకీయం నడుపుతున్నారు. కాస్తో కూస్తో అసెంబ్లీలో మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనే సీనియర్ లీడర్ గొంతు వినిపిస్తున్నారు. ఆయన కూడా తీవ్ర అసంతృప్తితోనే రగిలిపోతున్నారు. తనకు కాదని పయ్యావుల కేశవ్ కు ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టడంపై గుర్రుగానే ఉన్నారు. ఇక చంద్రబాబుకు తోడుగా యువ ఎంపీ రామూ ఉన్నారు. మరో ఎంపీ గల్లా జయదేవ్ (గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం) ఉన్నా, మరో ఎంపీ కేశినేని నాని (విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం) ఉన్నా వీళ్లెవ్వరూ పెద్దగా రాణించడం లేదు. రాజ్య సభ లో పెద్దదిక్కుగా న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ ఉన్నా ఆయన కూడా పెద్దగా టీడీపీ వాయిస్ వినిపించడం లేదు. ఒకప్పుడు ఎంపీలుగా పనిచేసిన బుట్టా రేణుక కానీ మురళీ మోహన్ కానీ ఇంకా ఇతరులెవ్వరూ చెట్టుకొకరు పుట్ట కొకరు. బుట్టా రేణుక సొంత పార్టీ పెట్టారు అనుకోండి అది వేరే విషయం. ఇక మురళీ మోహన్ అస్సలు రాజకీయ తెరపై కనిపించక చాలా కాలమైంది. ఇక పార్టీని ఎవరు కాపాడతారు. ఎవరు రక్షిస్తారు ఈ ఉత్పతనం నుంచి ఈ ఉత్పాతం నుంచి? ఇదే సందర్భంలో రాజధాని కేంద్రంగా రాజకీయం నడిపి ఏదో సాధించాలని చంద్రబాబు చూస్తున్నారు. కానీ రాజధాని సమస్య కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన సమస్యగా టీడీపీ ని ఇరకాటం పెట్టేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు చాలా వరకూ సఫలీకృతం అయ్యాయి. పైకి మాట్లాడే ధైర్యం అయితే వైసీపీలో ఉన్న కమ్మ సామాజికవర్గ నేతలు చేయకపోయినా రేపు అన్నీ కలిసి వస్తే వీరంతా మళ్లీ చంద్రబాబు నీడ చెంతకు చేరిపోయేం దుకు సిద్ధం అన్నది బహిరంగ రహస్యం. అందుకే జగన్ కూడా తన వెంట ఉన్న కమ్మ సామాజికవర్గం కదలికలపై పూర్తి విశ్వాసం కనబరచకపోవడమే మంచిదని కొందరి రెడ్ల వాదన.
- రత్నకిశోర్ శంభుమహంతి