టిఆర్ఎస్ పార్టీ... తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యపాత్ర వహించిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం.... టిఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అధికారం కట్టబెట్టారు తెలంగాణ ప్రజలు. ఇక 2014 నుంచి ఇప్పటి వరకు తిరుగులేని రాజకీయ శక్తిగా టిఆర్ఎస్ పార్టీ ఎదిగింది. అయితే అంతా బాగానే ఉంది కానీ అధికార పార్టీ టిఆర్ఎస్ లో కొన్ని లుకలుకలు రోజు రోజుకు బయటపడుతున్నాయి. మొన్నటి వరకు ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు గంగుల కమలాకర్ లాంటి కీలక నేతలు... మీడియా ముందు నోరు జారారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ చిక్కుల్లో పడింది. అయితే ఈ వివాదం ముగిసిందని అనుకునేలోపే... తాజాగా మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇంటికో ఉద్యోగం సాద్యమైయ్యే పనికాదని...ఏ ప్రభుత్వమైనా ఇవ్వలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లక్ష్మారెడ్డి.
తెలంగాణలో కోటి కుటుంబాలుంటాయన్న లక్ష్మారెడ్డి.. కోటి ఉద్యోగాలు ఇవ్వగలమా ? అని మీడియా వేదికగా ప్రశ్నించారు. మొత్తం జనాభా లో కేవలం ఒక్క శాతం మంది కే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలమని కుండ బద్దలు కొట్టారు. బడ్జెట్ మొత్తం కాదు కదా మూడంతల బడ్జెట్ అయినా సరిపోదని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. ఉద్యోగ మంటే.. ప్రభుత్వ ఉద్యోగమే అనుకోవడం సరికాదని ఎద్దేవా చేశారు. చదివిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటే ఎలా ? అని ప్రశ్నించారు లక్ష్మారెడ్డి. జడ్చర్ల లోని పిఆర్టీయూ భవన ఓపెనింగ్ కార్యక్రమం లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీ లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వడం లో విఫలమైందని టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉండగా.. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కామెంట్స్.. కెసిఆర్ సర్కార్ ను మరింత ఇరుకున పెట్టాయి.
ఇక ఇది ఇలా ఉండగా స్టేషన్ ఘనపూర్ టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు కొనసాగుతోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరియు మాజీ మంత్రి కడియం శ్రీహరి మధ్య మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని తాటికొండ రాజయ్య వర్గంపై కడియం శ్రీహరి మండిపడ్డారు. అయితే దీనికి తాజాగా తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తనకు కెసిఆర్ అండ ఉందని.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఏ అభివృద్ధి పనిచేసినా... అది తన ఖాతాలోకి వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇద్దరు నేతల మధ్య లో కార్యకర్తలు నలిగిపోతున్నారు. దీనిపై వెంటనే అధిష్ఠానం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.