బైడెన్ తప్పుడు నిర్ణయం.. భారీ మూల్యం చెల్లించుకున్న అమెరికా..?

Chakravarthi Kalyan
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయంతో అమెరికా భారీ మూల్యం చెల్లించిందా.. తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా దాన్ని సురక్షితంగా అమలు చేయడంలో బైడెన్ విఫలమయ్యారా.. మరోసారి అమెరికన్ల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారా.. అంటే అవుననే అనిపిస్తోంది. కాబూల్‌లో జరిగిన జంట ఆత్మాహుతి దాడుల భీతావాహ దృశ్యాలు చూస్తే బైడెన్ వైఫల్యం కళ్లకు కడుతుంది.

తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ నిన్న సాయంత్రం ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు కాబూల్‌ హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ బాంబు దాడుల్లో కనీసం 72 మంది దుర్మరణం చెందినట్టు తెలుస్తోంది. ఇలా చనిపోయినవారిలో తమ సైన్యానికి చెందిన 12 మంది ఉన్నట్టు అమెరికా చెబుతోంది.  

ఎప్పుడో 20 ఏళ్లనాడు.. ఉగ్రవాదుల దాడుల్లో న్యూయార్క్‌లో జరిగిన భారీ ప్రాణనష్టానికి ప్రతీకారంగా అమెరికా సైన్యాలు అఫ్గాన్‌ చేరాయి. ఏళ్ల తరబడి అఫ్గాన్‌లో పెత్తనం చెలాయించాయి. ఇక అక్కడ ఉండటం అనవసర ఖర్చు అనుకున్న అమెరికా ఇటీవల అఫ్గాన్‌ నుంచి సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం చాలా వివాదాస్పదం అయ్యింది. అఫ్గాన్‌లోని ముష్కర మూకలను మట్టుబెట్టకుండానే ఆ దేశం విడిచిపోతే అది ప్రపంచానికే ప్రమాదకారి అవుతుందన్న వాదనలు వచ్చాయి.

పోనీ.. అఫ్గాన్‌ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించుకున్నా.. ఆ వ్యూహాన్ని సురక్షితంగా అమలు చేయలేకపోయింది. వందల మంది తమ పౌరులు ఇంకా అఫ్గాన్‌లో ఉండగానే తన నిర్ణయం ప్రకటించింది. తాలిబన్లకు ఊపునిచ్చింది. ఫలితంగానే ఇప్పుడు ఈ మారణ హోమం. తమపై ఉగ్రదాడులు జరుగుతాయని తెలిసినా తన సైనికులను కాపాడుకోలేని నిస్సహాయ దేశంగా ఇప్పుడు అమెరికా ప్రపంచం ముందు నిలిచింది. అఫ్గాన్‌తో అమెరికా ఆడిన చెలగాటం చివరకు తన సైనికులకే ప్రాణ సంకటం అయ్యింది. మరి దీనికి అమెరికా ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: