దేశంలో కరోనా ఉదృతి కాస్త తగ్గడంతో ప్రజలు బయటకు రావడం మొదలు పెట్టారు. కొందరు జనాలు అయితే ఇక కరోనా మన మద్య లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. బాధ్యతను విస్మరించవద్దని ప్రజలకు విన్నవించింది. ఇలాగే నిర్లక్ష్యం కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే తాజాగా ఉత్తరాఖండ్ లోని కెంప్టీ జలపాతం దగ్గర కొందరు యాత్రికులు వ్యవహిరించన తీరు అందరినీ భయాందోళనలకు గురి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ అంశంపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో డెల్టా వైరస్ ఉదృతి పెరుగుతోందని గుర్తు చేస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ పేర్కొంది.
మనల్ని, మన కుటుంబాన్ని ఈ సమాజాన్ని కరోనా నుండి సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని ఈ చీడ పురుగు పూర్తిగా అంతరించే వరకు జాగ్రత్త తప్పనిసరి అని సూచించింది. బంగ్లాదేశ్ లో కరోనా కేసులు మూడవ దశలో భారీగా నమోదవుతున్న కారణంగా ఆ దేశం ఇప్పటికే లాక్ డౌన్ విధించిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మొదటి దశలో వచ్చిన కేసులు కంటే మూడవ దశలో వస్తున్న కేసులు గణనీయంగా పెరిగాయని తెలిపింది. మరో వైపు దేశంలో సగం పైగా కేసులు కేరళ మరియు మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నట్లు తెలియజేసింది. ఈ రెండు రాష్ట్రాలలో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసింది.
దేశ వ్యాప్తంగా 43,393 కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో.. కేరళలో ఆ సంఖ్య 13,772 కేసులు నమోదు అవుతుండగా మహారాష్ట్రలో 9,083 కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాలు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని తెలిపింది. దేశం లో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుందని ప్రజలు టీకా వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని, దేశంలో ఇప్పటివరకు 37 కోట్ల మందికి పైగా ప్రజలు మొదటి డోస్ కరోనా తీసుకున్నట్లు వెల్లడించింది.