గ్రామాల్లో ఆక్సిజన్ ప్లాంట్ ల నిర్మాణానికి గూగుల్ సాయం...
ఈ కరోనా సమయంలో ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు ఏకంగా రూ.113 కోట్ల సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పలు స్వచ్ఛంద సంస్థలతో కలసి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది గూగుల్ సంస్థ. దేశంలోని దాదాపు 80 గ్రామాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల వలన దేశంలో ఆక్సిజన్ కొరత చాలా వరకు తగ్గిపోతుందనే చెప్పాలి. భారీ స్థాయిలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చిన గూగుల్ సంస్థకు దేశం నలుమూలల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ప్లానింగ్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరలో పనులు మొదలుపెట్టనున్నారని సమాచారం. అంతే కాకుండా ఈ కరోనా కష్ట సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది గూగుల్ సంస్థ. 20 వేల మంది ఆరోగ్య సిబ్బందికి అపోలో మెడి స్కిల్స్ ద్వారా కరోనా నిర్వహణకు సంబంధించిన శిక్షణను అందించేందుకు సైతం సిద్ధమైనట్లు ప్రకటించింది. మరోవైపు 15 రాష్ట్రాల్లో 1.8 లక్షలమంది ఆశా వర్కర్లకు, 40 వేల మంది ఏఎన్ఎమ్ లకు శిక్షణ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం.