వివాదంలో బ్రహ్మంగారి పీఠం.. ?
ఇప్పుడు బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు అనేది పెద్ద పంచాయితీగా మారింది. ఆ పీఠాధిపతి పీఠం కోసం బ్రహ్మం గారి వారసుల మధ్య వైరం కొనసాగుతోంది. కడప జిల్లా కందిమల్లాయపల్లె గ్రామంలో జీవ సమాధి అయ్యారు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఈ విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఆయన తర్వాత ఏడు తరాల వరకు ఇక్కడ మఠం, దేవాలయాలను నిర్మించారు. అత్యంత సుందరంగా వీటిని తీర్చిదిద్దారు.
ఇప్పటి వరకు ఏడు తరాల వారు బ్రహ్మంగారి మఠానికి పీఠాధిపతి అయ్యారు. చివరగా వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి పీఠాధిపతిగా ఉన్నారు. అయితే, ఇటీవల ఆయన మరణించాడు. దీంతో పీఠాధిపతిగా ఆయన ఇద్దరు భార్యల సంతానంలో ఎవరిని చేయాలనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మొదటి భార్య చంద్రావతమ్మకు ఎనిమిది మంది సంతానం ఉన్నారు. అందులో నలుగురు కుమారులు, నలుగురు కూతుళ్లున్నారు. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
అయితే వెంకటేశ్వరస్వామి తన మరణానంతరం పీఠాధిపతి ఎవరు కావాలనేదానిపై ఓ వీలునామా రాశారు. అందులో మొదటి భార్యకు చెందిన రెండో కుమారుడు, చిన్న భార్యకు చెందిన ఒక కొడుకు పేరు ఉంది. దీంతో వారిద్దరిలో ఇప్పుడు ఎవరికివ్వాలనేది పెద్ద సమస్యగా మారింది. గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య కొడుకుకే ఇవ్వాలని చెబుతున్నారు. కానీ వీలునామాలో తన కుమారుడి పేరు ఉందని కానీ తన కుమాకుడు వయస్సులో చిన్నవాడు కాబట్టి తానే మఠాధిపతి పీఠాన్ని స్వీకరిస్తానని మారుతి లక్ష్మమ్మ చెబుతోంది.
దీంతో పీఠాధిపతి ఎంపికను దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రాణాప్రతాప్ ప్రాథమిక విచారణ వాయిదా వేసి వెళ్లిపోయారు. దీంతో అసలు కథ మళ్లీ మొదటికొచ్చింది. మరి వీరిలో ఎవరు పీఠాధిపతి అవుతారో చూడాలి.