ఉచితంగా డయాలసిస్‌, భోజనం.. ఎక్కడో తెలుసా..!?

Suma Kallamadi
ప్రస్తుత కాలంలో వైద్యం చేయించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. జబ్బు, దగ్గు, జ్వరం వచ్చిందంటే చాలు వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద జబ్బు వస్తే లక్షలు గుమ్మరించాల్సిందే. బతకడానికి ఆశలో ధనవంతులు లక్షలు గుమ్మరిస్తే.. పేదవాడికి మాత్రం ఒక్కింత నిరాశే మిగులుతోంది. డబ్బులు లేకపోవడంతో ఆరోగ్య సమస్య ఉన్నా.. అనారోగ్యంతో పోరాడుతూ.. చివరికీ ప్రాణాలు విడుస్తున్నాడు. ఈ కాలంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉన్నత వైద్యం అందించి.. ఉచిత సదుపాయాలు, భోజనం అందించే సంస్థలు చాలా తక్కువగానే ఉన్నాయి. పెద్ద పెద్ద రోగాలకు ఫ్రీగా వైద్యం అందిస్తూ.. ప్రజలందరి ఆదరణ పొందుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద కిడ్నీ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. సిక్కు గురుద్వారా కమిటీ ఈ కిడ్నీ ఆస్పత్రి బాధ్యతను తీసుకుంది. ప్రతిరోజు 500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఉచితంగా డయాలసిస్ సౌకర్యం కల్పించేందుకు ఈ ఆస్పత్రిని పునఃప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఎలాంటి వైద్య ఖర్చు ఉండదు. ప్రతిది ఉచితంగా కల్పిస్తారు. 20 ఏళ్ల కిందట మూతబడిన బాలాసాహిబ్ ఆస్పత్రిని గురు హరికృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ పేరుతో పునఃప్రారంభించారు. అలా దేశంలోనే అతి పెద్ద కిడ్నీ డయాలసిస్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు.
ఈ ఆస్పత్రిలో 24 గంటలూ రోగులకు వైద్య సేవలు అందిస్తారు. ఏకకాలంలో 101 మందికి డయాలసిస్ చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. అలా రోజుకీ 500 మందికి డయాలసిస్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో కేవలం 101 పడకలు మాత్రమే ఉన్నాయి. త్వరలో 1000 పడకలు పెంచేందుకు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్యం ప్రయత్నిస్తోందని.. ఆ కమిటీ అధ్యక్షుడు మజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిలో ఉచితంగా భోజన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. దేశంలో కడ్నీ వైద్యరంగంలో ప్రఖ్యాతిగాంచిన వైద్యులు ఈ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారని కమిటీ ప్రతినిధులు తెలిపారు. కాగా, ఇంత పెద్ద ఆస్పత్రిని నిర్వహించాలంటే ఎంతో ఖర్చు ఉంటుందని, అందుకే ఆస్పత్రి నిర్వహణకు అవసరమయ్యే నిధుల వనరులను కార్పొరేట్, వివిధ ప్రభుత్వ పథకాల నుంచి సమకూర్చుకుంటామని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: