జలవిలయానికి అసలు కారణం అదేనా..?
ఇది ఈనాటి కథ కాదు. ఐదు దశాబ్దాల క్రితం... అంటే 1964లో చైనా తొలిసారి అణుపరీక్షలు జరిపింది. ఆ పరీక్షలు.. అమెరికాలో అనుమానాన్ని, అసహనాన్ని పెంచాయి. దీంతో, చైనా అణుపాటవం మీద ఫోకస్ పెట్టాలనుకున్న అగ్రరాజ్యం.. దానికి భారత్ సాయం కోరింది. అందులో భాగంగానే 1965లో అమెరికా సీఐఏ తో కలిసి ఆపరేషన్ హ్యాట్‌కు భారత్ ఐబీ ఓకే చెప్పింది. చైనామీద కన్నేసి ఉంచేందుకు అనువైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ ఆపరేషన్ హ్యాట్ ముఖ్య ఉద్దేశం. అది జరగాలంటే చైనాకు సమీపంలో ఉండి... ఉన్నచోట నుంచి చైనా పరిసరాలను గమనించగల స్థావరం కోసం వెతకాలి. దానికోసం ఎంచుకున్న స్థలమే నందాదేవి పర్వతం. అక్కడ సెన్సార్స్ ఏర్పాటు చేస్తే.. చైనా గుట్టు కాస్తయినా తెలుస్తుందని సీఐఏ, ఐబీ భావించి... 1965 జూన్ 23న ట్రయల్ రన్ కూడా నిర్వహించి సక్సెస్ అయ్యాయి.
ఆ తర్వాత నాటి కెప్టెన్ మన్మోహన్ కోహ్లీ నేతృత్వంలో.. సీఐఏ, ఐబీ బృందం నందాదేవి పర్వతంపైకి ... ప్రక్రియకు అవసరమైన ఎక్విప్‌మెంట్ తీసుకెళ్లింది. అందులో అణు ఇంధనంతో నడిచే జనరేటర్, ఫ్లూటోనియం క్యాప్సూల్, ఏంటెనాలు ఉన్నాయి. అయితే, ఆ బృందం వెళ్లి ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాల్ చేసే సమయానికి అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంకాసేపు ఉంటే ప్రాణాలే పోయేవి. దీంతో భయపడి అందరూ వెనక్కి వచ్చేశారు. వాతావరణం అనుకూలించాక మళ్లీ పని మొదలుపెట్టాలనుకున్నారు. కానీ, మళ్లీ వెళ్లి చూస్తే.. అక్కడ అణుధార్మిక పదార్థమైన ఫ్లూటోనియం క్యాప్సూల్ లేదు. జనరేటర్ కూడా మిస్సయ్యింది. యాంటీనాల జాడా కనిపించలేదు. అదృశ్యమైన అణు పదార్థం కోసం ఎంత గాలించినా ఫలితం దక్కలేదు. ఈ విషయాన్ని మన్మోహన్ కోహ్లీనే స్వయంగా వెల్లడించారు.
నందాదేవిలో అదృశ్యమైన ఫ్లూటోనియం భయం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆ క్యాప్సిల్ లైఫ్ టైమ్ వందేళ్లు. ప్రస్తుతం 55ఏళ్లు పూర్తయ్యింది. అంటే ఇంకా 45 ఏళ్లు మిగిలే ఉంది. కాబట్టి, ఆ అణుపదార్థం వల్లే.. ఈ ఉపద్రవం సంభవించి ఉండొచ్చన్న అనుమానాలూ లేకపోలేదు. ఆపరేషన్ హ్యాట్ కారణంగానే.. ఈ మంచు బీభత్సం అనే సందేహాలు ఉద్భవిస్తున్నాయిప్పుడు.
పెరిగిన టెక్నాలజీతో ఫ్లూటోనియాన్ని కనిపెట్టొచ్చా?
ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది... మిస్సైన ఆ ఖనిజం ఎంత లోతులో ఉందో తెలుసుకునే సత్తా ఉంది.. కాబట్టి, నందాదేవిపై ఇప్పటికైనా పరిశోధనలు చెయ్యాలని రెండేళ్ల క్రితం కెప్టెన్ మన్మోహన్ కోహ్లీ కేంద్రాన్ని కోరారు. వెలికి తీయకపోతే ఎప్పటికైనా ప్రమాదం తప్పదని హెచ్చరించారు. పరికరాల జాడ కోసం ప్రయత్నిస్తామని అప్పట్లో ప్రధాని మోడీ కూడా చెప్పారు. నందాదేవిలో ఉన్న ఫ్లూటోనియం కరగడం ప్రారంభిస్తే.. అది గంగానది నీటిలో కలుస్తుంది. దీంతో అక్కడి నుంచి పశ్చిమబెంగాల్ వరకూ రేడియేషన్ ప్రభావం ఉంటుంది. నందాదేవి పర్వతం ఒక్కసారిగా కూలడానికి.. ఇలాంటి ప్రభావమే కారణమై ఉండొచ్చనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.