నిర్లక్ష్యంగా ఉంటే కరోనా ఎవరికైనా సోకుతుంది.... రోగులకు మంత్రి హరీశ్ రావు కీలక సూచనలు...?

Reddy P Rajasekhar

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1,554కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 842 మందికి వైరస్ నిర్ధారణ అయింది. కరోనా విజృంభణ తరుణంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వైరస్ నియంత్రణ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. 


 
హరీశ్‌రావు మెదక్ ఎంపీ, ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి సిద్ధిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామం ఆర్వీఎం ఆస్పత్రిలో 100 పడకల బ్లాక్, కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ను ప్రారంభించారు. ప్రజలు కరోనా కట్టడి కొరకు ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వైద్యులు, స్టాఫ్ నర్సులను బాగున్నారా...? అని పలకరించి కరోనా రోగులను కుటుంబ సభ్యులుగా భావించి సేవలందించాలని సూచించారు. 


 
రోగులతో ప్రేమగా వ్యవహరించాలని.... చిరునవ్వుతో సగం రోగం నయమవుతుందని చెప్పారు. ఐసోలేషన్ బ్లాక్ లో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం చికిత్స పొందుతున్న కరోనా బాధితుడితో మాట్లాడారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే త్వరగా వైరస్ నుంచి కోలుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. ల్యాబ్ లో రోజుకు 300 మందికి పరీక్షలు చేయవచ్చని ఐసీఎంఆర్ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పరీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. 


 
ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితి విషమించే వరకు బాధితులు వేచి చూడవద్దని తెలిపారు. కరోనా నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికైనా సోకుతుందని.... వైరస్ సోకిందని తెలియగానే కొంతమంది షేమ్ గా ఫీల్ అవుతున్నారని... వ్యాధి సోకితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.ప్రభుత్వం ఇప్పటికే పీపీఈ కిట్లు, మందులను అందుబాటులో ఉంచిందని.... ప్రతిరోజూ హాట్ వాటర్ తో పాటు 250 రూపాయల విలువైన ప్రోటీన్లతో కూడిన సంతులిత ఆహారం ఇస్తుందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: