అన్ లాక్ 2.0 : ఆ దేశంలో ఇంట్లోనే సులభంగా కరోనా సోకిందో లేదో పరీక్షించుకోవచ్చు... ఎలా అంటే....?
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పట్టణాల నుంచి పల్లెలకు పాకిన వైరస్ ప్రజలు రోడ్లపై అడుగులు వేయాలంటే భయపడేలా చేస్తోంది. అన్ లాక్ 2.0 సడలింపుల తర్వాత ప్రతిరోజూ వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో ఆందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి.
అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా సోకిందో లేదో ఎవరికి వాళ్లు ఇంటినుంచే తెలుసుకునే సదుపాయం కల్పించింది. ప్రజలు ఇంటి దగ్గరే తమ లాలాజలంతో స్వయంగా పరీక్ష చేసుకుని వైరస్ సోకిందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ ప్రయోగ పరీక్షల్లో 14,000కి పైగా ఉద్యోగులు, ఇతర కార్మికులు పాల్గొంటున్నారు. సౌత్ ఆంప్టన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టును నెలరోజుల పాటు నిర్వహిస్తారు.
నిపుణులు ఈ ప్రయోగం సక్సెస్ అయితే ప్రజలకి కరోనా వైరస్ నిర్ధరణ చేసుకోవడం సులభమవుతుందని చెబుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లు సాధారణంగా స్వాబ్ పరీక్షల కోసం గొంతు లోపలి నుంచి నమూనాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ లాలాజల పరీక్ష ద్వారా ప్రజలు సులభంగా కరోనా సోకిందో లేదో తెలుసుకునేలా చేస్తుంది.
లూప్ మెడియటేడ్ ఐసో థర్మల్ ఆమ్ప్లిఫికేషన్ విధానం ద్వారా వైరస్ లో ఉండే జెనెటిక్ ను గుర్తించి కరోనా నిర్ధారణ చేసుకోవచ్చు. పరీక్ష చేసిన గంటలోనే ఈ ఫలితాలు వెలువడతాయి. స్వాబ్ పరీక్షల కన్నా ఈ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించడం సులభమని నిపుణులు చెబుతున్నారు. ఇంటి నుంచి ఎవరికి వారే పరీక్షలను నిర్వహించుకోవడం ద్వారా సులభంగా కరోనా సోకిందో లేదో తెలుస్తుందని వైరస్ నిర్ధారణ అయిన వాళ్లు హోమ్ ఐసోలేషన్ కు వెళ్లాల్సి ఉంటుందని బ్రిటన్ అధికారులు చెబుతున్నారు.