వారికి జగన్ సర్కార్ శుభవార్త... 3,795 వీఆర్వో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి యువతకు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. గత సంవత్సరం 2,70,000 గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలు, 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన జగన్ సర్కార్ తాజాగా 3,795 వీఆర్వో గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వీఆర్వో పోస్టులు భర్తీ చేసింది. 
 
అయితే ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు(వీ.ఆర్.ఏ) గా పని చేస్తున్న అర్హులను వన్ టైమ్ ప్రాతిపదికన వీఆర్వోలుగా ఎంపిక చేయాలని వివిధ అసోసియేషన్లు విజ్ఞప్తులు చేయడంతో జగన్ సర్కార్ ఐదు నెలల కిందటే సానుకూల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 3,795 వీఆర్వో ఉద్యోగాలను ఇంటర్మీడియెట్‌ తత్సమాన విద్యార్హతలు ఉన్న వీఆర్‌ఏలతో భర్తీ చేయడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతులు ఇచ్చింది. 
 
గతంలో రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసినా సాంకేతిక కారణాల వల్ల ఈ ఫైల్ పెండింగ్ లో పడింది. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం మరోసారి విజ్ఞప్తి చేయడంతో రెవెన్యూ శాఖ తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. సీనియారిటీ ప్రాతిపదికన అర్హులైన వీఆర్‌ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. 
 
దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. వీఆర్వోలుగా ఎంపిక కావాలంటే ఇంటర్మీడియెట్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. జనవరి ఒకటి నాటికి వీఆర్‌ఏలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తై ఉండాలి. ఇంటర్ చదవకుండా డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా అర్హులే. అర్హులైన వీఆర్‌ఏలను వీఆర్వోలుగా వన్‌టైమ్‌ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సర్వీసు నిబంధనలలో ఒకే పర్యాయానికి అనే షరతుతో నిబంధనలను సడలించింది. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: