బ్రేకింగ్ : తెలంగాణలో మరో రెండు పాజిటివ్ కేసులు... కరోనా బాధితుల సంఖ్య ఎంతంటే...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నిన్న మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 72కు చేరింది. కొన్ని రోజుల క్రితం ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వారితో తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా అతని కుటుంబంలోని ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
కరోనా బాధితుడి తల్లి, సోదరికి కరోనా సోకినట్లు కలెక్టర్ మీడియాకు తెలిపారు. అధికారులు ఈ ఇద్దరిని కలిసిన వ్యక్తుల గురించి విచారణ చేస్తున్నారు. వీరితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. సదరు వ్యక్తి ఇంట్లో 8 మంది ఉండగా ఇద్దరికి మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గాంధీ ఆస్పత్రిలో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఉదయం పరీక్షలు జరిగాయి. వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతూ ఉండటం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్, కరీంనగర్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినా పూర్తి స్థాయిలో కరోనాను కట్టడి చేయడంలో కొంతమేర విఫలమవుతోంది. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులన్ని కాంటాక్ట్ కేసులే కావడం గమనార్హం. ప్రభుత్వం ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తోంది. 
 
మరోవైపు ఏపీలో కూడా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈరోజు ఉదయం తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో ఒకరు 72 ఏళ్ల వృద్ధుడు కావడం గమనార్హం. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు కొత్త కేసులు నమోదు కాకుండా నిబంధనలలో మార్పులు చేస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులే నమోదవుతున్నా వైజాగ్, కృష్ణా జిల్లాలలో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉండటంతో ఆ జిల్లాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: