అసలు నిర్భయ దోషులు ఉరికి ముందు ఏం చేశారంటే...?
దేశంలో ఎనిమిదేళ్ల కిందట సంచలనం రేపిన నిర్భయ అత్యాచారం ఘటనకు నేడు న్యాయం జరిగింది. ఎనిమిదేళ్ల కిందట దారుణ అత్యాచారానికి గురై నిర్భయ కన్ను మూసింది. ఆ దురాగతానికి పాల్పడిన దోషులకు చట్టపరంగా ఉరి శిక్ష వేశారు జైలు అధికారులు. నిర్భయ హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష వెయ్యటంతో మరో సారి ఉరిశిక్ష అనే అంశం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.
ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. చివరకు నాలుగోసారి డెత్ వారెంట్ జారీ అయింది. మార్చి 20న ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ఈసారి కూడా దానిని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఉరికి ఒకరోజు ముందు పటియాల కోర్టు, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేసి చావు దెబ్బ తిన్నారు. అంతేకాదు.. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉరికి మూడు గంటల ముందు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా అంతిమ తీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చింది.
అనంతరం వారిని స్నానం చేయాలని కోరారు. ఆ తర్వాత నలుగురు దోషులన ఇష్టమైన మతపరమైన పూజలు చేసుకునేందుకు జైలు అధికారులు సమయం కేటాయించారు. అయితే నలుగురు దోషులు కూడా జైలు అధికారులతో తమ ఇష్ట దైవాలను తలచుకునే సమయం అక్కర్లేదని తిరస్కరించినట్లు సమాచారం. నలుగురు దోషులను ఉరి తీసే ముందు తాము ఎలాంటి పూజలు చేయమని తేల్చి చెప్పడంతో జైలు అధికారులు వారికి అల్పాహారం అందించారు.
నలుగురు దోషులను వైద్యులు పరీక్షించారు. నలుగురు దోషులకు జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో కాటన్ వస్త్రంతో ముఖాలను కప్పి ఉరికంబం ఎక్కించారు. తిహార్ జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ ల సమక్షంలో జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశానుసారం తలారి పవన్ జల్లాద్ ఉరి తీశారు. ఎంతో కాలం నుండి న్యాయం కోసం ఎదురుచూస్తున్నా ప్రజలందరు తివారి జైలు ముందు సంబరాలు చేసుకున్నారు.