కాంగ్రెస్ పరిస్ధితి ఎలాగైపోయిందో చూశారా ?

Vijaya
స్ధానికసంస్దల ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో కాంగ్రెస్ పార్టీ డొల్లతనం బయటపడిపోయింది.  మెజారిటి ప్రజల మనోగతానికి వ్యతిరేకంగా అందులోను ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేసిన పాపం కాంగ్రెస్ పార్టీని ఇంకా వెంటాడుతునే ఉంది. తాజగా ఎంపిటిసి, జడ్పిటిసి స్దానాలకు ముగిసిన నామినేషన్లలో హస్తం పార్టీ తరపున దాఖలైన నామినేషన్లే ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది.

ఎన్నికల కమీషన్ అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారమైతే 652 జడ్పిటిసి స్ధానాలకు కాంగ్రెస్ తరపున 368 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అలాగే  9696 ఎంపిటిసి స్ధానాలకు గాను హస్తం పార్టీ నేతలు  395 నామినేషన్లు మాత్రమే వేశారు. జడ్పిటిసి నామినేషన్లలో పర్వాలేదని అనుకున్నా ఎంపిటిసి నామినేషన్ల విషయంలో మాత్రం బొత్తిగా పార్టీ తేలిపోయిందనే చెప్పాలి.

నిజానికి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఇప్పటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీని పట్టించుకుంటున్న జనాలే లేరు.  రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ అనేదొక జాతీయ పార్టీ ఉందని కూడా ఎవ్వరూ గుర్తించటం లేదు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో  మొదలైన పార్టీ డౌన్ ఫాల్ ఇంకా కంటిన్యు అవుతునే ఉంది. పోయిన ఎన్నికల్లో కానీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కానీ పోటి చేసిన కాంగ్రెస్ నేతలకు ఏ నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదంటే అర్ధం చేసుకోవచ్చు పార్టీ పరిస్ధితి.

అదే పరిస్ధితి ఇప్పటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా కంటిన్యు అవుతోంది. విచిత్రమేమిటంటే కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున పోటి చేస్తున్న అభ్యర్ధులకన్నా బిజెపి, జనసేన పార్టీల అభ్యర్ధుల గురించే కొద్దిగా మాట్లాడుకుంటున్నారు. హోలు మొత్తం మీద పై మూడు పార్టీల తరపున పోటి చేస్తున్న అభ్యర్ధుల ప్రభావం ఏమీ ఉండదనే అర్ధమైపోతోంది. ఎక్కడైనా పై పార్టీల తరపున ఎవరైనా గెలిచారంటే అది వ్యక్తిగతంగా సదరు నేతలకున్న పట్టువల్లే కానీ పార్టీల వల్ల కాదనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: