మండలి కార్యదర్శిని టార్గెట్ చేసిన టిడిపి.. ఏం చేస్తోందో తెలుసా ?

Vijaya
ప్రభుత్వాన్నో లేకపోతే అధికారపార్టీనో ఏమీ చేయలేక చివరకు శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణను తెలుగుదేశంపార్టీ టార్గెట్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటమే కాకుండా తాము చెప్పినట్లుగా వినకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయంటూ నలుగురు టిడిపి ఎంఎల్సీలు ఏకంగా కార్యదర్శి కార్యాలయానికే వెళ్ళి బెదిరంచటం విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు తన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నీ తనిష్టప్రకారమే జరగాలని పట్టుబట్టడంతోనే  అసలు కంపు మొదలైంది.

అసెంబ్లీ పాస్ చేసిన రెండు బిల్లులు శాసనమండలికి వచ్చాయి. నిబంధనల ప్రకారం చేయాల్సింది చేయకుండా ఛైర్మన్ ఎంఏ షరీఫ్ ను తెరవెనుక నుండి చంద్రబాబు, యనమల రామకృష్ణుడు మ్యానేజ్ చేశారన్నది వాస్తవం. అందుకనే తనకు లేని అధికారాలను చేతుల్లోకి తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా సెలక్ట్ కమిటి పరిశీలను పంపుతున్నట్లు ప్రకటించారు. అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘించినా  ఛైర్మన్ చెప్పినట్లే వ్యవహారాలు జరగాలని టిడిపి పట్టుబడుతోంది. షరీఫ్ కూడా టిడిపి సభ్యుడే కాబట్టి చంద్రబాబు, యనమల ఒత్తిడి బాగా పనిచేస్తోందనే అనుకోవాలి.

ఈ నేపధ్యంలోనే సెలక్ట్ కమిటిని నియమించినట్లుగా ఆదేశాలు ఇవ్వటం నిబంధనలకు విరుద్ధమంటూ  చెప్పిన సెక్రటరీపై టిడిపి సభ్యులు మండిపోతున్నారు. ఏకంగా ఆఫీసుకే వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. సెక్రటరీ మీద కోర్టులో కేసు వేస్తామని, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని బెదిరించటమే  విచిత్రంగా ఉంది.  మండలి రద్దైపోతోందనే విషయం నిర్ధారణ అయిపోయింది.

అందుకనే ఆ ఉక్రోషాన్ని జగన్మోహన్ రెడ్డిపై చూపలేక అందుబాటులో ఉండే సెక్రటరీ మీద చూపుతున్నారు. విషయం ఏమిటంటే తాము నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు యనమల అండ్ కో కు బాగా తెలుసు. తెలిసినా కావాలనే  ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నం చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. సరే చివరకు ఏమవుతుందన్నది వేరే సంగతి. ఓ నాలుగు రోజులు చవకబారు ప్రచారానికైతే ఉపయోగపడుతందని అనుకుంటున్న టిడిపిని చూస్తే జాలేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: