బిజెపి+పవన్ ను నిలువునా ముంచేసిన కేంద్రం

Vijaya
వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో ఏదోలా ఎదుగుదామని  ప్రయత్నాలు చేస్తున్న బిజెపి+జనసేన పార్టీలపై కేంద్రప్రభుత్వం నిలువునా ముంచేసిందనే చెప్పాలి.   తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి ప్రయోజనాలను కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి నిర్మల సీతారామన్ ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఏపిని డెవలప్ చేద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోడికే ఇష్టం లేనపుడు మంత్రి మాత్రం ఏం చేస్తారు లేండి.

2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి సభలో ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని మాటిచ్చిన మోడినే తర్వాత మొహం చాటేశారు. ఇక రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న వాటిని కూడా పూర్తిగా నెరవేర్చకుండానే ఐదేళ్ళు గడిపేశారు. మాటిచ్చి తప్పిన ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేస్తున్న మంత్రి నుండి ఇంతకన్నా గొప్పగా ఆశించటం తప్పే అవుతుంది లేండి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బిజెపి-రాష్ట్ర ప్రయోజనాలన్నది గుడ్డు ముందా కోడి ముందా అన్నట్లుగా తయారైంది. ఏపిలో బిజెపి బలపడితే కానీ రాష్ట్రప్రయోజనాల గురించి  కేంద్రం పట్టించుకోదు.  అదే విధంగా ఏపి ప్రయోజనాలను కేంద్రం కాపాడితే కానీ ఏపిలో బిజెపి బలపడదు. అంటే రెండింటిలో ఏది ముందు ? అన్నది తేల్చుకోలేకే మోడి ఏపి ప్రయోజనాలను పూర్తిగా పక్కనపడేసినట్లు అర్ధమైపోతోంది.

ఏపిలో బిజెపి ఎప్పటికీ బలపడే అవకాశం కనబడటం లేదు. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళే పార్టీని నట్టేట ముంచేసినపుడు ఇంక బలపడే అవకాశం ఎక్కడుంది. అందుకనే పవన్ కల్యాణ్ ను పట్టుకుంది. అయితే ఇపుడు రెండు పార్టీలు మరోసారి ముణిగేట్లే కనబడుతోంది. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంత కాలం ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు పార్టీ ప్రయోజనాలకన్నా చంద్రబాబునాయుడు రక్షణే ధ్యేయంగా పనిచేసిన విషయం అందరూ చూసిందే. 

పోనీ రాష్ట్ర నేతల్లోని ఎంతమందికి  కేంద్ర ప్రభుత్వంలోని  నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు ?  అంటే ఇటు పార్టీ పరంగా కానీ అటు పోస్టుల పరంగా కానీండి నేతల్లో చాలామందిని ఎదగనీయకుండా తొక్కిపడేశారు. దాని పర్యవసానంగానే మొన్నటి ఎన్నికల్లో  బిజెపికి వచ్చిన ఓట్లకన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ. దానికి బోనస్ గా ఇపుడు నిర్మల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపికి అన్నింటా మొండి చెయ్యే.  విచిత్రమేమిటంటే బిజెపి నేతలే కాదు చివరకు పవన్ కూడా ఈ విషయంలో కేంద్రాన్ని ఏమీ  అడగటం లేదు. మొత్తానికి పార్టీ బలోపేతం విషయంలో రెండు పార్టీలపై  కేంద్రం పెద్ద బండ వేసిందనే  చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: