’మండలి’  గండం నుండి బయట పడే మార్గాలేంటో తెలుసా ?

Vijaya
అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మండమైన మెజారిటి ఉన్నా శాసనమండలిలో మాత్రం మెజారిటి  గండం వెంటాడుతునే ఉంటుంది.  ఎందుకంటే 58 మంది సభ్యులున్న మండలిలో వైసిపికి ఉన్న బలం కేవలం తొమ్మిది మాత్రమే. తెలుగుదేశంపార్టీకి 26 మంది సభ్యుల మెజారిటి ఉంది. బిజెపి, పిడిఎఫ్, ఇండిపెండెంట్ సభ్యుల సంఖ్య కూడా తక్కువే. అందుకనే అసెంబ్లీలో పాసవుతున్న కీలక బిల్లులు శాసనమండలిలో మాత్రం వీగిపోతున్నాయి.

మరి ప్రభుత్వం తీసుకునే బిల్లులు మండలిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మార్గాలేమిటి ? ఏమిటంటే అందుకు మూడు మార్గాలున్నాయి.  ఒకటి మండలిలో మెజారిటి సాధించుకోవటం. రెండోది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక బిల్లులు అనుకున్నపుడు ముందుగా  గవర్నర్ దగ్గరకు పంపి ఆర్డినెన్సు జారీ చేయించుకోవటం. చివరగా శాసనమండలిని రద్దు చేసేయటం.

మండలిలో మెజారిటి సాధించటం అంటే మామూలు పరిస్ధితుల్లో ఇప్పటికిప్పుడు సాధ్యంకాదు. ఎందుంకటే 2021, జూన్ వరకూ టిడిపికే మెజారిటి ఉంటుంది. అందుకని చంద్రబాబునాయుడు అనుసరించిన విధానంలోనే జగన్ కూడా ప్రయాణించి టిడిపి ఎంఎల్సీలను లాగేసుకోవటమే. ఓ 15 మంది ఎంఎల్సీలను గనుక లాగేసుకోగలిగినా లేక రాజీనామాలు చేయించగలిగినా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఒకళ్ళు రాజీనామా చేశారు.

15 మంది సభ్యులను దూరం చేయగలిగితే అప్పుడు టిడిపి బలం 10కి పడిపోతుంది. వైసిపికి తొమ్మిది మందే ఉన్నా ఇతరుల సాయంతో బిల్లులను పాస్ చేసుకోవచ్చు. ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటే నలుగురైదుగురిని వదిలిపెట్టేసి మిగిలిన అందరినీ దూరం చేస్తే ఇంకా మంచిది. అప్పుడు జగన్ కు మండలిలో ఎటువంటి సమస్యా ఉండదు. అది వద్దను కుంటే అసెంబ్లీ, మండలిలో బల్లులను ప్రవేశపెట్టకుండానే  గవర్నర్ తో మాట్లాడి ఆర్డినెన్సు జారీ చేయించుకోవటం. తర్వాత తీరిగ్గా ఉభయ సభల్లో పెట్టి తీర్మానాలు చేయించుకోవచ్చు.

పై రెండు మార్గాలు  వద్దని అనుకుంటే ఏకంగా శాసనమండలిని రద్దు చేసేయటమే. ఈ పని చేస్తే  చంద్రబాబునాయుడు నోరు శాస్వతంగా మూతపడిపోతుంది. కాకపోతే ఒక్కసారిగా వైసిపి నేతలు కూడా నిరాసపడిపోవచ్చు. వాళ్ళకి ఏదో ఓ రూపంలో సంతృప్తి పరచవచ్చని అనుకుంటే మండలి రద్దుకే జగన్ మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: