జనవరి 1 నుండి ప్రజా రవాణా సంస్థ
ఆర్టిసి ఇక ప్రజా రవాణా వ్యవస్థగా మారనుంది. ఆ సంస్థలోని 51,488 మంది జనవరి ఒకటో తేదీ నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈచర్యతో 2021-22 సంవత్సరం నుండి సంస్థకు నికర మిగులు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. ప్రసుత్తం నెలకు రూ.100 కోట్ల నష్టం వస్తోందని, ప్రభుత్వ నిర్ణయం వల్ల అది తగ్గుతుందని పేర్కొంది. అన్ని ఖర్చులకు సంబంధించి విడివిడిగా నిర్వహణా వ్యయాన్ని, ఖర్చును తగ్గించి సామర్థ్య ప్రమాణాలను పెంచుతామని బిల్లులో తెలిపింది.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ఆర్టిసి ఉద్యోగులకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే విలీనం చేశామని తెలిపారు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన జిఓ వల్ల ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాలేదని, అయినా తాము పట్టుబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో లేరు. ఈ విషయాన్ని ముఖ్య మంత్రి ప్రస్తావించారు. ప్రతపక్ష నేత అసెంబ్లీలో లేకపోవడం దురదృష్టకరమన్నారు రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ ఈబిల్లుతో ఆర్టిసి ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని పేర్కొన్నారు. టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆర్టిసి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకన్నా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
.మద్య నిషేద సవరణ బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది . ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ మద్యం అక్రమ అమ్మకాలకు పాల్పడితే క్రిమినల్‌తో పాటు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని సిఎం వైఎస్ జగన్ అన్నారు. దోషులకు జైలు శిక్షతో పాటు లక్షల్లో అపరాధ రుసుమును విధిస్తామన్నారు. తమ ప్రభుత్వం రాగానే 43 వేల బెల్ట్‌షాపులను తీసేశామన్నారు. నోరు తెరిస్తే అచ్చెన్నాయుడు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. సోమవారం మొత్తం 16 బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సి కమిషన్(ఎస్సీ కమిషన్) బిల్లు-2019, రాష్ట్ర ఎస్టి (ఎస్టీ )కమిషన్ బిల్లు -2019, ఆర్టిసి బిల్లు, ఆంధ్రప్రదేశ్ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగులపై పన్ను (సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్‌ఆబ్కారీ (రెండవసవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ మద్య నిషేధం (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ వస్తువులు, సేవల పన్నుల (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల (సవరణ) బిల్లు, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టాల (రెండవ సవరణ) బిల్లు, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, లలిత కళల విశ్వవిద్యాలయం(సవరణ) బిల్లు, చిరుధాన్యాల బోర్డు బిల్లులకు ఆమోదం తెలిపారు. వీటితోపాటు పప్పు ధాన్యాల బోర్డు బిల్లు, ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల(రెండవ సవరణ) బిల్లు, కర్నూలులో క్లస్టరు విశ్వవిద్యాలయం ఏర్పాటు చట్టం -2019, ఎపి మునిసిపల్ లా (అమెండ్మెంట్) యాక్ట్-2019, ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టం(1/1982(అమెండ్మెంట్ యాక్ట్- 2019 బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, ఆత్యాచారాలను నిరోధించడానికి శాసనసభలో ఆమోదించిన దిశ బిల్లును హోంమంత్రి ఎం సుచరిత సోమవారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై మండలిలో సుదీర్ఘ చర్చ జరిగింది. హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాల నియంత్రణకు దర్యాప్తు వేగవంతం చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌ల సంఖ్య పెంచుతామని చెప్పారు.
రాష్ట్ర అబ్కారీ చట్ట సవరణ బిల్లును శాసనమండలి స్వల్ప చర్చతో సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి తరపున మరో ఉపముఖ్యమంత్రి అజాం బాషా ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో మద్యం నిషేధాన్ని దశల వారీగా అమలు చేయడంలో భాగంగా వ్యాపారస్తుల ద్వారా మద్యం విక్రేయాలను నియంత్రిస్తున్నట్లు తెలిపారు. పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మద్యం లభ్యత తగ్గితే తాగే వారి సంఖ్య తగ్గుతుందన్నారు. నియంత్రణ వల్ల ఎంత ఆదాయం తగ్గిందో కూడా చెప్పాలని కోరారు. మద్యం స్థానంలో కల్తీ సరుకు, నాటుసారా రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాము సూర్యారావు మాట్లాడుతూ కొంతమంది గోదావరి జిల్లాల నుంచి మద్యం కోసం యానాం వెళ్తున్నారని తెలిపారు. మద్యం నిషేదంతో పాటు కోడిపందేలు, జూదం కూడా నిషేధించాలని కోరారు. రాష్ట్రంలో పర్యాటక, సంస్కృతి వారసత్వపు బోర్డు ఏర్పాటుకు రూపొందించిన చట్ట సవరణ బిల్లును పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ సోమవారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నామినేట్ చేసే విధంగా ఛైర్మన్, ఆరుగురు సభ్యులు ఈ బోర్డులో ఉంటారని మంత్రి తెలిపారు. ఈ బిల్లును స్వల్ప చర్చతో ఆమోదించారు.