అధికారులను యసిడ్-వాష్ చేసేసిన న్యాయస్థానం-పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వానికీ చివాట్లే!

ఆర్టీసీ సమ్మె పిటిషన్‌ పై హైకోర్టులో నిన్న (గురువారం) విచారణ జరిగింది. అయితే విచారణ ముగియకుండానే ఎటూ తేలని పరిస్థితుల్లో ఈ నెల 11 కు వాయిదా పడింది.

Did you mislead kcr cabinet and high court on rtc Financial Facts & Figures: high court serious on telangana IAS officers


తెలంగాణా ప్రభుత్వం తరఫున:

*ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి,

*ఆర్టీసీ ఇన్-చార్జ్ ఎండీ సునీల్ శర్మ,

*ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు

*జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్


 

హైకోర్ట్ లో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన ‘నివేదిక’ లపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అభ్యంతరం, అసహనం వ్యక్తం చేసింది.  అఖిలభారత సత్ర్వీసుల నుండి వచ్చిన ఐఏఎస్ స్థాయి అధికారులు ఎంత నిర్మాణాత్మకంగా ఉండాలో అలా జరగక - ఇంత దారుణంగా నివేదిక ఇవ్వడం తన 15 ఏళ్ల  సర్వీస్‌ లోనే చూడలేదని చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు.

 

తన జీవిత కాలంలో ఇంతగా అబద్ధాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని చీఫ్ జస్టిస్ విరుచుకు పడ్డారు. పై ముగ్గురుతో కలసి టిఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, చెబుతున్న అంకెలు సరిపోలటం లేదని  తాము వేటిని పరిగణన లోకి తీసుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానాన్ని  తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి గణాంకాలు వ్యూహాత్మక పదజాలం  వాడారని హైకోర్టు పేర్కొంది.

రవాణా శాఖా మంత్రికి ఆర్టీసీ ఇన్-చార్జ్ ఎండీ సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని, ఆయనకు తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని దగా చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. మంత్రిమండలికి సైతం అధికారులు తప్పుడు గణాంకాలు అందజేశారని, ముఖ్యమంత్రికి తప్పుడు లెక్కలు అందజేసి ఆయనతో తప్పుడు స్టేట్‌మెంట్ ఇప్పించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  తమను తప్పు దోవ పట్టించిన ఆర్టీసీ ఇన్‌ చార్జి ఎండీని రావాణాశాఖ మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో? అర్థం కావడం లేదంటూ మండిపడింది.

 

జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు ఒక్కొక్కరు ఒక్కో రీతిన తమకు తోచిన విధంగా గణాకాల గీతం పాడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని, అసలు హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా! అని అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది. తాము సమస్యను పరిష్కరించాలని చూస్తుంటే, ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఐదే ఐదు  నిమిషాలు తన స్ధానంలో ఉండి చూడాలని, మీ నివేదికలు మీరు చెప్పే మాటలు అసలు నమ్మే విధంగా ఉన్నాయా? అంటూ అధికారులపై చీఫ్ జస్టిస్ తీవ్రంగా మండిపడ్డారు.

 

ప్రభుత్వం, కార్మిక సంఘాలవల్ల గత నెల రోజులకు పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం ₹ 47 కోట్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. ₹ 47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఎందుకు అంత ఇబ్బంది పెడుతోందని హైకోర్టు ప్రశ్నించింది.


అధికారుల తప్పుడు నివేదికల కారణంగా విచారణ మళ్లీ వాయిదా పడింది. మరి అధికారులు ఇకనైన సరైన నివేదికలు ఇస్తారో? లేక ఇలానే తప్పుడు లెక్కలు చూపించి హైకోర్టు చేత చివాట్లు తింటారో? చూడాలి.


ఏది ఏమైనా, ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతుంటే సైతం ఈ నలుగురు ఐ ఏ ఎస్ అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ  అటు కోర్ట్ సమయాన్ని వృధా జేస్తూ – ప్రజా జీవితాన్ని నరకయాతనగా మారుస్తూ భాధ్యతా రహితంగా కాలయాపన చేయడం దురదృష్టకరం. మరి హైకోర్టు ఈ సమస్యకు 11వ తేదీన అయినా పరిష్కారం చూపుతుందేమోనని ప్రజలు నిరీక్షిస్తున్నారు.


అధికారుల తప్పుడు నివేదికలతో “రాజ్యాంగ వ్యవస్థలోని మూలస్థంబం ఎక్జెక్యూటివ్ వ్యవస్థ” తెలంగాణాలో కుళ్ళికునారిల్లుతున్నట్లే. కోర్టులో విచారణ జరిగేవేళ అక్కడున్న కొందరు ఉద్యోగులు కావచ్చు “ముఖ్యమంత్రి చెప్పినట్లు నివేదికలు తయారు చెయ్యటమెందుకు న్యాయస్థానంలో చివాట్లు తినడమెందుకు ఐఏఎస్  అధికారులను ఉద్దెశించి అనటం వినిపించింది. అయితే ఐఏఎస్ అధికారులు “అయ్యా! ఎస్” అంటూ రాజకీయ నాయకుల ఆధిపత్యానికి తలొగ్గినంత వరకు భారత రాజ్యాంగం చట్టుబండలే! చీము రక్తం ఉన్నవాళ్ళెవరైనా న్యాయస్థానం చివాట్లతోనైనా సిగ్గుపడి ఇకనైనా నిజాయతీగా వ్యవహరిస్తారో? లేదో? అనేది పదకొండో తారీఖున తేలుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: