సమ్మెపై హై కోర్టు సంచలనం
గడచిన నెల
రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై హై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 6వ తేదీన
జరగబోయే విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ
ఇన్చార్జి ఎండితో పాటు జిహెచ్ఎంసి కమీషనర్ ను కోర్టులో హాజరవ్వాలని ఆదేశించటం
సంచలనంగా మారింది. తాజాగా జారీ చేసిన ఆదేశాలతో సమ్మె విషయాన్ని హై కోర్టు ఎంత
సీరియస్ గా తీసుకుందో అర్ధమైపోతోంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొండివాడు మహారాజుకన్నా బలవంతుడు అనే సామెత నిజమవుతోంది. ఆర్టీసీ దురదృష్టం ఏమిటంటే ఇక్కడ మొండివాడు, మహారాజు రెండు కూడా కెసియారే అవ్వటం. ఆర్టీసీ పై ప్రభుత్వం కోర్టుకు అందచేసిన నివేదికల్లో చాలా వరకూ అబద్ధాలే ఉంటున్నాయని కోర్టు ఇప్పటికే చాలాసార్లే ఆక్షేపించింది. అయినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావటం లేదు.
ఆర్టీసీ లాభ, నష్టాలపై, ఖర్చులు, బడ్జెట్ కేటాయింపులు తదితరాలపై కెసియార్ చెప్పిన చాలా విషయాలు అసత్యాలే అని కార్మిక నేతలు కోర్టులో ఆధారాలతో సహా నిరూపించారు. ఆర్టీసీ ఇన్చార్జి ఎండి చెప్పే లెక్కలకు, రవాణా శాఖ కమీషనర్ తో పాటు ముఖ్య కార్యదర్శి ఇచ్చిన లెక్కలకు పొంతనే లేదు. ఈ విషయాలపై కోర్టు నిలదీస్తే ఉన్నతాధికారుల నుండి సమాధానమే లేదు.
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపమని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశాలిచ్చినా కెసియార్ పెద్దగా లెక్క చేయటం లేదు. పైగా 5వ తేదీలోగా విధుల్లో చేరకపోతే కార్మికులు, ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోతారంటూ తాజాగా బెదిరింపులకు దిగటమే విచిత్రంగా ఉంది.
సరే కోర్టు ఎటువంటి ఆదేశాలిచ్చినా కెసియర్ ఏమాత్రం లెక్క చేయకపోవటమే విచిత్రంగా ఉంది. కార్మిక సంఘాల నేతలపై కెసియార్ వ్యతిరేకభావనతో ఉండటం వల్లే సమ్మె ఎంత ఉధృతంగా జరుగుతున్నా 20 మంది చనిపోయినా కెసియార్ ఏమాత్రం లెక్క చేయటం లేదు. మరి చివరకు సమ్మె విషయంలో న్యాయస్ధానం ఎటువంటి ఆదేశాలిస్తుందో చూడాల్సిందే.