చేతులెత్తేసిన హై కోర్టు..ప్రభుత్వానికి సిగ్గు చేటే

Vijaya

ఆర్టీసీ సమ్మె విషయంలో హై కోర్టు తాజా ఆదేశాలు చూస్తుంటే చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది.  కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఇటు ప్రభుత్వంపైనే కాకుండా అటు కార్మిక సంఘాల నేతలకు కూడా చురకలు వేసింది. దాంతో కోర్టు సమ్మె విషయంలో ప్రభుత్వం, కార్మిక సంఘాల నేతల్లో ఎవరికి మద్దతుగా నిలిచిందన్న విషయంలో అయోమయం నెలకొంది.

 

సమ్మె పేరుతో 11 రోజులుగా   ప్రజలను, విద్యార్ధులను ఇబ్బంది పెట్టటం ఎంత వరకూ సబబంటూ కార్మిక సంఘాల నేతల లాయర్ ను నేరుగా ప్రశ్నించింది. తక్షణమే సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రెడీ అవ్వాలని ఆదేశించింది. అదే సందర్భంగా సమ్మె ప్రభావంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా అడ్వకేట్ జనరల్ తో స్పష్టంగా చెప్పింది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలకు కార్మిక సంఘాల నేతలు సిద్ధంగానే ఉన్నా కెసియారే పట్టించుకోవటం లేదు. కార్మికులను, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రశక్తే లేదని కెసియార్ తెగేసి చెప్పారు. దాంతో సమ్మె చేస్తున్న కార్మికులు, ఉద్యోగులను సెల్ఫ్ డిస్మిస్ అంటూ కెసియార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపింది.

 

ఒక్కసారిగా ఆర్టీసీలో పనిచేస్తున్న 42 వేలమంది సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు కెసియార్ ప్రకటించటంతోనే సమస్య బాగా పెరిగిపోయింది. దాంతో నిరవధిక సమ్మెకు దిగిన కార్మికుల విషయంలో కెసియార్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించటమే కాకుండా వారిని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. దాంతో ఒకటి రెండు రోజుల్లో అయిపోతుందనుకున్న సమ్మె కాస్త 11 రోజులకు చేరి ఉధృతంగా మారింది.

 

డిమాండ్లు పరిష్కారం కానిదే సమ్మెను విరమించేది లేదని ఒకవైపు ఆర్టీసీ జేఏసి నేతలు, సమ్మె విరమిస్తేనే చర్చలు జరుపుతామంటూ ప్రభుత్వం షరతులు విధిస్తుండటంతో  సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలేమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. విచిత్రమేమిటంటే ఆర్టీసీకి ఇంత వరకూ పూర్తిస్ధాయి ఎండి కూడా లేకపోవటమే. అందుకనే కోర్టు ప్రభుత్వాన్ని వాయించేసింది. ముందుగా ఆర్టీసీకి పూర్తిస్ధాయి ఎండిని నియమించాలని ఆదేశించటం నిజంగా ప్రభుత్వానికి సిగ్గు చేటనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: