టిడిపి నేతలపై పెట్టినవి తప్పుడు కేసులేనా ?
తెలుగుదేశంపార్టీ నేతలపై
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందా ? చంద్రబాబునాయుడు ఆరోపణలు
విన్నవారికి నిజమే అనిపిస్తుంది. కానీ వాస్తవాలేమిటి ? ఏమిటంటే రెండు రోజుల్లో
టిడిపి నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కరణం బలరామ్, కూన రవికుమార్ పై
పోలీసులు కేసులు పెట్టారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వంపై మండిపోతున్నారు.
కేసులు పెట్టడం వరకూ నిజమే. కానీ ఆ కేసుల్లో ఏవి కూడా తప్పుడు కేసులు కావు. సోమిరెడ్డి దొంగ పత్రాలతో, ఫోర్జరీ సంతకాలతో తనను మోసం చేశాడంటూ ఓ బాధితుడు కోర్టుకెక్కాడు. 3.5 ఎకరాల భూమి అమ్మకంలో తనను సోమిరెడ్డి మోసం చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. దాంతో విచారణ జరిపిన కోర్టు సోమిరెడ్డి మీద కేసు పెట్టమని ఆదేశించింది. వెంకటాచలం పోలీసులు వివిధ సెక్షన్ల క్రింద సోమిరెడ్డిపై కేసు పెట్టారు.
ఇక కూన రవికుమార్ విషయం చూస్తే ఈ మాజీ ఎంఎల్ఏ మరీ బరితెగించాడు. తనకు అణకువగా ఉండాలని, తాను చెప్పినట్లు వినాలంటూ ఏకంగా ఓ ఎంపిడివోనే బెదిరించారు. నేరుగా ఎంపిడివో కార్యాలయంకు వెళ్ళి తలుపులు వేసేసి చావ బాదితే అడిగే దిక్కు కూడా ఉండదంటూ రెచ్చిపోయారు. అంతకుముందే మరో అధికారిణిని కూడా అలాగే ఫోన్లో బెదిరించారు.
ఎంఎల్ఏలపై బాధితులిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటి నుండి ఎంఎల్ఏ పరారీలో ఉన్నాడనుకోండి అది వేరే సంగతి. అధికారం పోయిన తర్వాత ఎంఎల్ఏ తన సహజత్వాన్ని మార్చుకోకుండా అధికారులను కొడతాను, చంపుతానని బెదిరిస్తే ఎలా ? పైగా ఎంఎల్ఏ గొడవ విషయం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. అయినా అవన్నీ తప్పుడు వీడియోలని చంద్రబాబు అంటున్నారంటే ఏమిటర్ధం ?
చివరగా కరణం సంగతే తీసుకుంటే ఆయనపైన కూడా పోలీసులు కోర్టు ఆదేశాలతోనే కేసు పెట్టారు. ఎవరినో కరణం కొట్టారట. ఆయనపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోర్టుకెక్కారు. దాంతో కేసు పెట్టమని కోర్టు ఆదేశించటంతో కేసు నమోదైంది. ఈ మూడు ఘటనల్లోను ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులేమున్నాయో చంద్రబాబే చెప్పాలి.