సాహో సినిమాను చినబాబు ప్రమోట్ చేస్తున్నారా ?

Vijaya

వినటానికే విచిత్రంగా ఉంది కదూ. హీరో ప్రభాస్ నటించిన సాహో చిత్రాన్ని నారా లోకేష్ ప్రమోట్ చేస్తున్నారు. చాలామంది లాగే తాను కూడా సాహో చిత్రాన్ని చూడటానికి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అంతేనా..సాహో చిత్రాన్ని చూడమంటూ టిడిపి నేతలకు, కార్యకర్తలతో పాటు ప్రభాస్ అభిమానులకు  పెద్ద పిలుపేఇచ్చారు. సరే లోకేష్ చెప్పినా చెప్పకపోయినా ప్రభాస్ అభిమానులు ఎలాగూ సినిమా చూస్తారు లేండి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఓ సినిమాను పనిగట్టుకుని ప్రమోట్ చేయాల్సిన అవసరం లోకేష్ కు లేదు. స్వయంగా మామగారైన నందమూని బాలకృష్ణ నటించిన మహానటుడు, కథానాయకుడు సినిమాలు రిలీజ్ అయినపుడు కూడా లోకేష్ ఆ సినిమాలను చూడమని బహిరంగంగా ఎక్కడా చెప్పలేదు. అలాంటిది ఇపుడు అదే పనిగా సాహో సినిమాను చూడమని చెప్పటంలో అర్ధమేంటి ?

 

ప్రభాస్ చిన్నాన్న వెటరన్ నటుడు కృష్ణంరాజు బిజెపి నేతన్న విషయం అందరికీ తెలిసిందే. కృష్ణంరాజు గతంలో ఎంపిగా గెలిచి కేంద్రంలో మంత్రిగా కూడా చేశారు. కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నా పార్టీలో ఇపుడు మళ్ళీ యాక్టివ్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసేందుకు రంగం రెడీ చేసుకుంటున్నారు. అంటే బిజెపి-టిడిపికి తెరవెనుక ఉన్న బంధం వల్లే సాహో సినిమాను లోకేష్ ప్రమోట్ చేస్తున్నారా ? అన్న సందేహాలు పెరుగుతున్నాయి.

 

మొన్నటి ఎన్నాకల్లో వైసిపి చేతిలో చావు దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే నలుగురు రాజ్యసభ ఎంపిలను ముందుగా బిజెపిలోకి ఫిరాయించేట్లు చేశారు. తర్వాత తనకు నమ్మకస్తులైన పలువురు నేతలు కూడా బిజెపిలో చేరినా పల్లెత్తు మాట కూడా అనలేదు. ఈ నేపధ్యంలోనే సాహో చిత్రంపై లోకేష్ చేసిన ప్రకటన వీళ్ళ తెరవెనుక బంధాన్ని బలపరుస్తోందనటంలో సందేహమే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: