వైసిపి సోషల్ మీడియా పై ఉక్కుపాదం..అరెస్టులు తప్పవా ?
వైసిపికి బాగా మద్దతునిస్తున్న సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపటానికి
చంద్రబాబునాయుడు తాజాగా నిర్ణయించారు. అందులో భాగంగానే ఉయ్యూరులో టిడిపి నేతలు వైసిపి
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్న 16 మందిపై ఫిర్యాదు చేశారు. టిడిపి ఎంఎల్సీ
యలమంచిలి రాజేంద్రప్రసాద్ భార్య, కూతురుపై అసభ్యంగా పోస్టులు పెట్టారంటూ ఎంఎల్సీ
నేతృత్వంలో ఉయ్యూరు మండల టిడిపి నేతలు ఉయ్యూరు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. టిడిపి
నేతలు ఫిర్యాదంటే చెప్పేదేముంది ఇక అరెస్టులే తరువాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. జగన్ ను హత్య చేసేందుకు కుట్ర చేశారంటూ వైసిపి నేతలంటున్నారు. జగన్ పై దాడి అంతా ఓ డ్రామాగా చంద్రబాబునాయుడు అండ్ కో కొట్టిపారేస్తున్నారు. సరే ఎవరి వాదనలు వారివే అనుకోండి అది వేరే సంగతి. అయితే, చంద్రబాబు సంతోషం కోసం ప్రతిపక్ష నేతలపై ఎంతటి అసభ్యంగా అన్నా మాట్లాడేందుకు సదా సిద్ధంగా ఉండే రాజేంద్రప్రసాద్ ఇందులో తల దూర్చారు. మీడియాతో మాట్లాడుతూ, వైసిపి సారధ్య బాధ్యతలు తీసుకునేందుకు, సిఎం కుర్చీ కోసం తల్లి విజయమ్మ, సోదరి షర్మిలే జగన్ పై హత్యకు కుట్ర చేశారంటూ ఆరోపించారు. సరే, ఎంఎల్సీ ఆరోపణలపై చివరకు టిడిపినే తలదించుకోవాల్సొచ్చింది.
హత్యాయత్నం ఘటనలోకి ఎప్పుడైతే ఎంఎల్సీ జగన్ తల్లి, సోదరిని లాగారో అప్పటి నుండి వైసిపి సోషల్ మీడియా రెచ్చిపోయింది. ఎంఎల్సీ భార్య, కూతురిని సీన్ లోకి లాగింది. వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితాలను ఫొటోలతో సహా ఫేస్ బుక్, వాట్సప్ లోకి ఎక్కించేసింది. జగన్ తల్లి, సోదరిపై రాజేంద్ర మాట్లాడింది ఎంత తప్పో రాజేంద్ర భార్య, కూతురిని సోషల్ మీడియాలో లాగటమూ అంతే తప్పు. కానీ ముందు అసహ్యంగా మాట్లాడింది ఎంఎల్సీనే అన్న విషయం మరచిపోకూడదు. సరే తప్పొప్పులను ఎవరు పట్టించుకుంటారు ?
టిడిపి వాళ్ళు ఫిర్యాదు చేస్తే చాలు పోలీసులు రెచ్చిపోతున్నారు. ఈ విషయం గతంలో కూడా చాలా సార్లు రుజువైంది. ఎటూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. వైసిపి సోషల్ మీడియా ధాటిని చంద్రబాబు, లోకేష్ అండ్ కో తట్టుకోలేకున్నారు. కాబట్టి ఈ నేపధ్యంలో టిడిపి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోవటమే ఆలస్యం అన్నట్లుంది.