' జగన్ అనే నేను' అంటూ పెద్దాపురంలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం సాగింది. భరత్ అనే నేను అనే స్టైల్లో జగన్ చేసిన ప్రసంగానికి స్ధానికులు బాగానే కనెక్టయ్యారు. పెద్దాపురంలో జగన్ మాట్లాడుతూ, ప్రసంగం చివరికొచ్చేసరికి జగన్ అనే నేను అనగానే జనాలు చప్పట్లు, కేరింతలు కొట్టారు.
జనాల చెవిలో పూలు
వచ్చే ఎన్నికల్లో జనాలను మోసం చేసి ఓట్లు దండుకోవటానికి వీలుగా కేజి బంగారంతో పాటు బోనస్ గా బెంజికారు ఇస్తానని చంద్రబాబునాయుడు చెబుతారంటూ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పాదయాత్రలో భాగంగా జగన్ ఈరోజు పెద్దాపురంలో పర్యటించారు. పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి జనాల చెవుల్లో పూలు పెట్టటానికి చంద్రబాబు రెడీ అవుతున్నారట. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.
ఓటుకు 5 వేలు తీసుకోండి
మామూలు హామీలు చిన్న హామీలిస్తే జనాలు నమ్మరని చంద్రబాబుకు బాగా తెలుసని జగన్ గుర్తుచేశారు. కాబట్టి ప్రతీ ఇంటికీ కేజి బంగారం ఇస్తానని మళ్ళీ హామీలివ్వటానికి చంద్రబాబు ప్లాన్ వేసుకుంటున్నట్లు తెలిపారు. కేజి బంగారానికి బోనస్ గా ఓ బెంజికారు కూడా ఇస్తానని హామీ ఇస్తారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఓటుకు 3 వేల రూపాయలు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారట. అందుకనే డబ్బులు ఇవ్వటానికి వాళ్లు వచ్చినపుడు 3 వేలు కాదని 5 వేల రూపాయలు తీసుకోమంటూ జగన్ చెప్పారు. డబ్బులు టిడిపి దగ్గర తీసుకుని ఓట్లు మాత్రం వైసిపికి వేయాలంటూ విజ్ఞప్తి చేశారు.
మహిళల పేర్లపైనే ఇళ్ళు
ఇక, చంద్రబాబు పాలనంతా అబద్దాలు, అవినీతిపైనే సాగుతోందన్నారు. ప్రతీ సోమవారం చంద్రబాబు పోలవరం వచ్చేది పనుల పర్యవేక్షణకు కాదని కేవలం కమీషన్ల కోసమే అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి వల్లే పోలవరం పనులు కూడా సక్రమంగా జరగటం లేదన్నారు. వైసిపి అధికారంలోకి వస్తే సువర్ణయుగం తీసుకువస్తానని జగన్ హామీ ఇచ్చారు. వైసిపి అధికారంలోకి రాగానే ప్రతీ పేదవారికి ఇల్లు కట్టిస్తానంటూ హామీ ఇచ్చారు. నిజంగా ఆ హామీ అమలవుతుందో లేదో ఎవరూ చెప్పలేరు. ప్రభుత్వం కట్టిచ్చే ఇల్లు అక్క, చెల్లమ్మల పేర్లతోనే రిజిస్టర్ చేయిస్తారట. ఎందుకంటే, అవసరానికి బ్యాంకుల వద్దకు వెళ్ళి పావలా వడ్డీకి కుదవ పెట్టుకోవచ్చన్నారు. మొత్తానికి మహిళా ఓటర్లను కూడా జగన్ ఆకట్టుకునేందుకు హామీలు బాగానే గుప్పిస్తున్నారు.