ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల ఓట్లను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించినట్లు కనబడుతోంది. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడి సర్కార్ పై వైసిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో వైసిపి ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతిచ్చే విషయంలో చంద్రబాబు వేసిన పిల్లి మొగ్గలు అందరికీ తెలిసిందే. చివరకి అన్నీ వైపుల నుండి విమర్శలు రావటంతో తాను కూడా అవిశ్వాస తీర్మానం పెట్టామనిపించుకుని చేతులు దులుపుకున్నారు.
కేంద్రానికి నష్టం ఏమీ లేదు
అయితే, అప్పట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటానికి ఇపుడు ప్రవేశపెట్టటానికి చాలా తేడా ఉంది. కేంద్ర ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా మోడి సర్కార్ కు జరిగే నష్టం ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే తమ నిరసనను తెలియజేయటానికి అది ఒక మార్గమంతే. ప్రత్యేకహోదా ఇవ్వనందుకు కేంద్రంపై నిరసన తెలపటానికి కూడా చంద్రబాబు అప్పట్లో చాలా డ్రమాలు ఆడారు. అయితే, రానున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు చంద్రబాబే దూకుడు ప్రదర్శిస్తున్నారు.
చంద్రబాబు దూకుడుపై అనుమానాలు
ఇక్కడే చంద్రబాబు దూకుడుపై పలువురిలో అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే, త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. ఇపుడు గనుక మోడి ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకమని తాను సంకేతాలు పంపకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లు దూరమయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబు గ్రహించారు. అంటే అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టటంలో కేంద్రంపై నిరసన అనేకన్నా ముస్లిం మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోంది.
ఏపనీ ఊరకే చేయరు
చంద్రబాబు ఏపని చేసినా ఊరకే చేయరు. అందునా ఎన్నికల సమీపిస్తున్న నేపధ్యంలో అస్సలు చేయరు. తాజాగా మొదలుపెట్టిన అన్న క్యాంటిన్లు, గ్రామదర్శిని లాంటి కార్యక్రమాలే అందుకు నిదర్శనం. అటువంటిది ముస్లిం మైనారిటీల ఓట్లు కొల్ల గొట్టేందుకు చంద్రబాబు భారీ ఎత్తునే ప్రణాళికలు రచిస్తారనటంలో సందేహం లేదు. అసలే పోయిన ఎన్నికల్లో ముస్లిం మైనారిటీల్లో మెజారిటీ సెక్షన్ వైసిపికి పూర్తిగా మద్దతుగా నిలిచింది. టిడిపి తరపున పోటీ చేసిన ముస్లిం అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా గెలవలేదు. అందుకనే వైసిపి తరపున గెలిచిన జలీల్ ఖాన్, అత్తార్ చాంద్ భాషలను తమ పార్టీలోకి లాక్కున్నారు.
మద్దతు కోసం బృందాలుగా ఎంపిలు
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంలో భాగంగానే ఎంపిలను ఆరు బృందాలుగా విడగొట్టారు. ఒక్కో బృందానికి ఒక్కో బాధ్యత అప్పగించారు. ఆరు బృందాలు కూడా దేశంలో బిజెపిని వ్యతిరేకిస్తున్న 22 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టనున్నారు. మద్దతు కోసం ఇప్పటికే చంద్రబాబు పేరుతో ఆయా పార్టీల అధినేతలకు లేఖలు వెళ్ళాయి. తన తాజా ప్రయత్నంలో చంద్రబాబు ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాల్సిందే ?