భారతీయ స్త్రీ మూర్తి సాహసానికి ప్రతీక నీరజ

Krishna A.B

ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నామని చెప్పడం ఈరోజుల్లో అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఇక రాజకీయనేతల విషయం చెప్పపని లేదు. ప్రాణాలు ధారపోసయినా సరే లక్ష్యాలు సాధించేవరకు నిద్రపోమని హెచ్చులు పలికిన మన నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రజల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన చరిత్ర ఇటీవలి కాలంలో లేదు. కానీ విధినిర్వహణలో చేసిన బాసకు భంగం కలిగించకుండా కొన ఊపిరి వదిలేవరకు ప్రయాణికుల ప్రాణ రక్షణే కర్తవ్యంగా భావించి ఆ క్రమంలో అసువులు బాసిన ధీరవనితను మనం ఈరోజు మర్చిపోయి ఉండవచ్చు కానీ ప్రపంచ విమానయాన చరిత్రలో సాటిలేని త్యాగమూర్తిగా ఆమె నేటికీ ప్రపంచం నలుమూలల నుంచీ నీరాజనాలు అందుకుంటూనే ఉంది.

 

భారతీయ స్త్రీమూర్తి సాహసానికి, ధైర్యానికి, అనంత త్యాగరంజిత చరిత్రకు నిలువెత్తు సంకేతంగా నిలిచిన ఆ గగనవతి పేరు నీరజ. 1986లో కరాచీలో హైజాక్ అయిన ఫ్లైట్ 73 అనే పాన్అమ్ సంస్థకు చెందిన విమానంలో ఆమె ఎయిర్ హోస్టెస్‌గా తుది క్షణం వరకు విధిని నిర్వర్తించింది. ముంబై నుంచి 1986 సెప్టెంబర్ 5న కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అప్పుడే చేరుకున్న ప్లైట్ 73 విమానం కాస్సేపట్లో బయలుదేరుతుందనగా లిబియా మద్దతు కలిగిన అబూ నిదాల్ సంస్థకు చెందిన నలుగురు హైజాకర్లు విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

విమానం హైజాక్‌కు గురయిందన్న వార్త వినగానే నీరజ ఆ విషయాన్ని కాక్‌పిట్‌కు చేరవేసింది కానీ అమెరికన్ జాతీయులైన విమానం పైలట్, కో పైలట్, ఫ్లైట్ ఇంజనీర్ బ్రతుకు జీవుడా అనుకుంటూ ఉన్న ఫళాన విమానాన్ని వదిలి పారిపోయారు. దీంతో ఆ విమానంలోని 360 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడే బాధ్యత  పానమ్ విమానంలో సీనియర్ కేబిన్ క్రూగా ఉన్న నీరజపైనే పడింది. పైలట్, కో పైలట్, ఫ్లైట్ ఇంజనీర్ ఎవరూ లేని ఆ భారీ విమానంలో ప్రయాణికుల ప్రాణదాతగా నీరజ తన బాథ్యతలను తక్షణం స్వీకరించింది. నీరజతో పాటు విమానంలో ఉన్న సహాయ సిబ్బంది హైజాకర్లు వెతుకుతున్న 41మంది అమెరికన్ ప్రయాణికుల పాస్‌పోర్టులను దాచి ఉంచే క్రమంలో సాటిలేని సాహస ప్రవృత్తిని ప్రదర్శించారు. అమెరికన్ ప్యాసింజర్ల పాస్‌పోర్టులు సేకరించి ఇవ్వమని ఉగ్రవాదులు ఆదేశిస్తే నిరజతో సహా విమాన సిబ్బంది వాటిని సీట్ల కింద, చెత్త క్యాన్‌లోనూ దాచి ఉంచి 41 మంది ప్రాణాలనూ కాపాడారు.

 

దాదాపు 17 గంటల సంప్రదింపుల తర్వాత, ఓపిక నశించిన హైజాకర్లు విమానంలో కాల్పులు జరిపి, పేలుడు పదార్థాలను పేల్చినప్పుడు, నీరజ అత్యవసర ద్వారాన్ని తెలిచి ప్రయాణికులు సురక్షితంగా విమానం నుంచి దిగడంలో సహకరించారు. ప్రాణాలను కాపాడుకునే స్థితిలో ఉండి కూడా నీరజ తన స్థానం నుంచి పక్కకు కదలకుడా ప్రయాణికుల ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డుకట్ట వేసింది. హైజాకర్ల నుంచి ముగ్గురు పిల్లలను కాపాడే క్రమంలో వారి తూటాల బారిన పడి నీరజ కన్నుమూసింది. ఆనాటికి ఆమె వయస్సు 22 ఏళ్లు. మరో రెండు రోజుల్లో తన పుట్టిన రోజు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆమె నూరేళ్ల జీవితంలో పావు భాగం కూడా పూర్తిగా గడుపకముందే పరుల కోసం ప్రాణాలివ్వడం అనే మహోన్నత త్యాగ చరిత్రలో భాగమైపోయింది.

 

హీరోయిన్ ఆఫ్ ది హైజాక్‌గా, మానవజాతి పట్ల తన అంకితభావానికి, నిబద్ధతకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆ భారత స్త్రీమూర్తి పూర్తి పేరు నీరజా భానోత్. శాంతి కాలంలో ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలకు గాను మరణానంతరం ప్రకటించే భారతీయ అత్యుత్తమ పతకం అశోక చక్ర అవార్డును ఆమెకి ప్రదానం చేశారు. నాటికీ, నేటికీ అశోక చక్ర అవార్డును పొందిన ఏకైక భారతీయ మహిళకా నిరజ చరిత్రలో నిలిచిపోయారు.

 

మానవ ప్రాణాల పట్ల సాటిలేని ప్రేమను, కరుణను అత్యంత విపత్కర పరిస్థితుల్లో ప్రదర్శించి, ఆ కర్తవ్యంలోనే 360 మంది ప్రాణాలను ఉగ్రవాదుల దాడి నుంచి కాపాడిన ఈ త్యాగ శీలికి భారత్‌తో పాటు, అమెరికా, ఐక్యరాజ్య సమితి, పాకిస్తాన్ తదితర దేశాలు మరణానంతర అవార్డులతో సత్కరించాయి.

 

అసువులు బాసిన 30 ఏళ్ల తర్వాత నీరజ సాహసగాధపై ఫాక్స్ స్టార్ స్టూడియో నీరజ పేరిట సినిమా తీస్తోంది.  బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఈ చిత్రంలో నీరజ పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ నటి షబానా ఆజ్మీ.. నీరజా భానోత్ తల్లి పాత్రలో నటిస్తున్నారు. భారత విస్మృత ధీరనాయికల్లో నీరజ ఒకరని, ఆమె వీరోచిత గాథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలుగుతుందని ఆశిస్తున్నట్లుగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సీఈఓ విజయ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత తన నిజమైన హీరోలను, హీరోయిన్లను మర్చిపోతోందని, అలాంటి హీరోచిత గాధల్లో నీరజ కథ ఒకటని మా తొలి చిత్రంగా ఆమె జీవితంపైనే సినిమా తీస్తున్నందుకు గాను గర్వపడుతున్నామని నిర్మాత అతుల్ కాస్బేకర్ ప్రకటించారు.

 

ప్రపంచ విమాన యాన చరిత్రలో ఎన్నటికీ మరపురాని, మరువలేని భారతీయ యంగ్ బ్రేవ్‌హార్ట్ నీరజకు తమ సినిమా నివాళి పలుకుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటిస్తున్నారు. 2016 ఫిబ్రవరి 19న నీరజ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆమె జీవిత గాధ పేరుతో వస్తున్న ఈ సినిమా ఆమె జీవితానికి, త్యాగానికి న్యాయం చేస్తుందో లేదో తెలియదు కానీ.. ఒక విషయం మాత్రం అందరం గుర్తించుకోవాలి. ప్రపంచంలో చాలామంది ఇంజనీర్లు అవుతున్నారు. డాక్టర్లు అవుతున్నారు. సినిమా స్టార్లు అవుతున్నారు. కానీ... కొందరు మాత్రమే మనుషులవుతున్నారు... మనుషులుగా మారుతున్నారు... మనుషులుగా మిగులుతున్నారు. మన యంగ్ బ్రేవ్ హార్ట్ నీరజ కూడా వారిలో ఒకరు.

 

ప్రజల కోసం ప్రాణాలర్పించడం హిమాలయాల కంటే అత్యున్నతమైనది అన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్మాత మావో ఏ సందర్భంలో అన్నారో గానీ, మన నీరజ పాతికేళ్లు నిండని తన దివ్య భవ్య జీవిత విలువను సరిగ్గా ఆ హిమాలయాల్లో శిఖరస్థాయిలో నిలిపి ఉంచారు. భారతీయ వనిత ఇంతవరకూ ఎన్నడూ చేయని సాహస కృత్యం ఆమె పేరిట నమోదైంది. ప్రపంచ విమాన యాన చరిత్రలోనే అత్యంత ఘోరమైన హైజాకింగ్ ఘటనలో 360 మంది ప్రాణాలను కాపాడటానికి ఆమె ప్రదర్సించిన సాహసం నిరుపమాన ధీర కృత్యం. ఒక భారతీయ సాధారణ మధ్య తరగతి యువతి తన రక్త ప్లావిత త్యాగ చరిత్ర ద్వారా ఈ ప్రపంచం ముందు చెరగని స్ఫూర్తిని అందిస్తోంది.

 

త్యాగాల గురించి ఒట్టిమాటలు చెప్పుకుని ఫోజులు కొడుతున్న భ్రష్ట నేతలకు తెలియని విలువ ఆమె జీవితం. ప్రతి సంవత్సరం టీచర్స్ డే నాడే వచ్చే ఆమె వర్థంతిని మన దేశంలో ఎవరూ జరుపుకున్నట్లు లేదు. ఏ మీడియాలోనూ ఆ వార్త వచ్చినట్లు లేదు. కానీ 31 సంవత్సరాలు విమానయాన పరిశ్రమలో పనిచేసిన ప్రాంక్ స్మాల్ అనే భారతీయేతర వ్యక్తి ఆమె గురించి ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ హృదయాలను చలింప జేస్తోంది. "ఈరోజు విమానయాన చరిత్రలో ఒక హీరోని, పానమ్ ఫ్లైట్ అటెండెంట్‌ని మనం గౌరవించుకుంటున్నాం" అంటూ ఫ్రాంక్ పోస్ట్ చేసిన చిన్ని పోస్ట్ మానవత్వాన్ని ఉద్దీపింప జేస్తోంది. ఆమె వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. కానీ హైజాక్ నేపథ్యంలో విమాన సంరక్షణ బాధ్యతను తీసుకున్న క్షణాల్లో ఆమె తన జీవితం గురించి ఏమాత్రం ఆలోచించలేదు. బాధపడలేదు. ఆ సమయం కూడా ఆమెకు లేదు. ఈ హీరోయిన్ ఆఫ్ ది హైజాక్‌కి మా అశ్రు నివాళి అంటూ ఫ్రాంక్ తన పోస్టును ముగించారు.


ఇవేవీ మనకు పట్టవు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక యుద్ధంలో మునిగిపోయి ఉన్నాం. గొడ్డు మాంసం నుంచి మొదలైన భారతీయ ఆత్మహనన చరిత్రలో ఈదులాదుతూ సహన, అసహన విచికిత్సలో మునిగి తేలుతూ యావత్ ప్రపంచంలో మనకే సాధ్యమైన నీచ, నికృష్ట, మతిలేని మహా మురికి యుద్ధంలో మనల్ని మనం వెతుక్కుంటున్నాం మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: