నోరు జారితే ఊరుకోం.. 'పేట' నిర్మాతపై దిల్ రాజు ఫైర్!

Edari Rama Krishna
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు థియేటర్ల వివాదం నడుస్తుంది.  పరభాష చిత్రాలు, చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదని..బడా నిర్మాతల చేతుల్లోనే థియేటర్లు ఉంటున్నాయని..వారి ఆజమాయిషీతో చిన్న నిర్మాతలు నలిగిపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.  రజనీకాంత్ తాజా చిత్రం 'పేట'కు థియేటర్లు ఇవ్వడం లేదని చిత్ర నిర్మాత వల్లభనేని అశోక్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  తాజాగా ఈ వివాదం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. 

నిర్మాత వల్లభనేని తొందరపడి స్టేట్ మెంట్ ఇచ్చారేమో తనకు తెలియదని, ఇప్పుడు విడుదలవుతున్న 3 సినిమాలూ 6 నెలల క్రితమే రిలీజ్ ను ఖరారు చేసుకున్నాయని అన్నారు. వీటికే థియేటర్లు ఎలా సర్దుకోవాలన్న విషయమై ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. తెలుగు సినిమాలను తగ్గించుకుని వేరే భాషా చిత్రాలకు థియేటర్లను ఇచ్చే పరిస్థితి లేదని దిల్ రాజు తేల్చి చెప్పారు. 'పేట' చిత్రాన్ని 18వ తేదీన విడుదల చేస్తే, రెండు రాష్ట్రాల్లో థియేటర్లు దొరుకుతాయని, దీన్ని ఆలోచించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నోరుజారితే, తామూ విమర్శలకు దిగగలమని హెచ్చరించారు. 

పక్క రాష్ట్రం నుంచి 20 రోజుల ముందు చిత్రాన్ని కొనుక్కుని వచ్చి సంక్రాంతికి విడుదల చేయాలంటే ఎలాగని ప్రశ్నించారు. థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేయగలమని విమర్శించారు.  18 నుంచి థియేటర్లలో ‘పేట’ మాత్రమే ఉంటుందని అశోక్ అంటున్నారని, అలాంటప్పుడు 18నే ‘పేట’ను రిలీజ్ చేసుకోవచ్చు కదా? అన్నారు. మూడు క్రేజీ చిత్రాలకు థియేటర్లను ఇప్పటికే సర్దామని, ఈ విషయాన్ని గుర్తించాలని అన్నారు.

గత యేడాది తాను డిస్ట్రిబ్యూషన్ లో ఎంతో నష్టపోయానని గుర్తు చేశారు. డబ్బింగ్ సినిమా 'సర్కార్', 'నవాబ్' వంటి సినిమాలను ఎన్ని థియేటర్స్ లో కావాలంటే అన్ని థియేటర్లలో వేసుకున్నారని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు దొరకడం లేదని అంటున్నారని ఇది ఎంత వరకు సమంజసం అని అన్నారు దిల్ రాజు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: