ఏపీ: కర్నూలులో చంద్రబాబు కీలక సభలు.. వారిని గెలిపించుకునేందుకేనా?

Suma Kallamadi
ఏపీలో ఓ వైపు వైసీపీ, మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నాయి. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీని గెలిపించుకునేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఆ తర్వాత వివిధ నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇక కూటమి తరుపున చంద్రబాబు, పవన్ ప్రచార బాధ్యతలు భుజానకు ఎత్తుకుని వాటిలో తలమునకలవుతున్నారు. ముఖ్యంగా గోదావరి, విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో పవన్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మిగిలిన ఆంధ్రా జిల్లాలు, రాయలసీమలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు రంగంలోకి దిగారు. ముఖ్యంగా రాయలసీమలో టీడీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచార సభలను చంద్రబాబు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం చంద్రబాబు కర్నూలు జిల్లాలోని కోడుమూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. ఇదే కోవలో గూడూరు, కౌతాళంలో ఎన్నికల సభల్లో పాల్గొనేందుకు ప్లాన్ చేశారు.
ఇక నెల్లూరు నుంచి సాయంత్రం చంద్రబాబు కౌతాలం చేరుకోనున్నారు. అక్కడే రాత్రికి బస చేయనున్నారు. నందికొట్కూరులో సోమవారం చంద్రబాబు కీలక పర్యటన చేయనున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి గిత్తా జయసూర్యను చంద్రబాబు ప్రకటించారు. అయితే వైసీపీ నుంచి బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి తరచూ చంద్రబాబు, ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఆయన చెప్పిన అభ్యర్థినే వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. ఇక్కడ ఆయన ప్రాభవానికి చెక్ పెట్టేందుకే తమ అభ్యర్థి జయసూర్య తరుపున చంద్రబాబు ప్రచారానికి రానున్నారు. ఇక చంద్రబాబు పర్యటన వివరాలను నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.  
కాగా చంద్రబాబు పర్యటనలో భాగమైన హెలిప్యాడ్‌ను పరిశీలించేందుకు డీఎస్పీతో సహా అల్లూరు గ్రామానికి వెళ్లారు. ఇక చంద్రబాబు పర్యటన వివరాలను మాండ్ర శివానందరెడ్డి మీడియాకు వివరించారు. హెలికాప్టర్‌లో సోమవారం సాయంత్రం 5 గంటలకు టీడీపీ చంద్రబాబు హెలికాప్టర్‌లో చేరుకుంటారని వెల్లడించారు. అనంతరం నందికొట్కూరులోని అల్లూరు సర్కిల్, కొత్త బస్టాండ్, పటేల్ సెంటర్ వరకు చంద్రబాబు రోడ్ షో సాగుతుందన్నారు. ఆ తర్వాత పటేల్ సెంటర్‌లో టీడీపీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఇవి పూర్తైన తర్వాత అల్లూరులో రాత్రికి బస చేస్తారని వివరించారు. రాయలసీమలో టీడీపీ బలంగా ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు పర్యటనతో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని, ఇక్కడ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: