జగన్, షర్మిల వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? ఎవరి వద్ద ఎక్కువంటే..

Suma Kallamadi
ఏపీలో అన్నాచెల్లెలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య మాటల పోరు రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. తన ఆస్తి తనకు ఇవ్వకుండా జగన్ తనకు అప్పు ఇచ్చారని అన్నపై ఆమె నిప్పులు చెరిగారు. కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ తరుపున షర్మిల, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరుపున జగన్ తమ నామినేషన్లను ఇప్పటికే దాఖలు చేశారు. ఇక ఇద్దరి ఆస్తులను పరిశీలించి, ఎవరి వద్ద ఎక్కువ ఆస్తులు ఉన్నాయో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. తొలుత షర్మిల విషయానికొస్తే ఆమె తన నామినేషన్ పత్రాల్లో తనకు రూ.182.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. 


చరాస్తుల విలువ రూ.123.26 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.9.29 కోట్లుగా తెలుస్తోంది. రూ.3.69 కోట్ల విలువైన బంగారం,  రూ.4.61 కోట్ల విలువైన ఇతర ఆభరణాలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన అన్న, ఏపీ సీఎం జగన్‌కు రూ.82 కోట్లు అప్పు పడ్డారు. తన వదిన భారతి వద్ద రూ.19.56 లక్షల అప్పు చేసినట్లు తెలిపారు. తన ఆస్తులు తనకు ఇవ్వకుండా ఇలా సొంత అన్నే అప్పు రూపంలో ఇచ్చారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇక జగన్ విషయానికి వస్తే ఆయన దేశంలో అత్యంత సంపన్న సీఎంగా ఉన్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పోటీ చేస్తున్నారు. ఆయన సంపద గత ఐదేళ్లలో 41 శాతం పెరిగి రూ.529.50 కోట్లకు చేరుకుంది. 2022-23 సంవత్సరంలో ఆయన రూ. 57.75 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల విలువ రూ.375.20 కోట్లుగా ప్రకటించారు. తాజా ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ప్రకారం, జగన్ భార్య భారతి రెడ్డికి రూ.176.30 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి.


ఆయన భార్య భారతి రెడ్డి వద్ద కూడా 6.4 కిలోల బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయి, దీని మార్కెట్ విలువ రూ. 5.30 కోట్లు. జగన్‌, ఆయన భార్య సంపదలో ఎక్కువ భాగం భారతి సిమెంట్స్‌, సరస్వతి సిమెంట్స్‌, సండూర్‌ పవర్‌ కంపెనీల్లో వాటాల రూపంలోనే ఉంది. జగన్‌పై 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆయన సీఎం కాకముందు చాలా కేసులు సీబీఐ, ఈడీలు నమోదు చేశాయి. ఇలా చూస్తే వైఎస్ జగన్ వద్ద మొత్తం ఆస్తులు రూ.529.50 కోట్లు ఉండగా, షర్మిల వద్ద రూ.182.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. చెల్లి కంటే అన్న వద్దే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తేలింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: