సినిమా చిత్రీకరణ వెనక ఎంత కష్టం ఉంటుందో దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు కూడా చిత్రబృందం అంతే కష్టపడుతుంది. దర్శక నిర్మాతల దగ్గరినుంచి నటీనటుల వరకు అంతా ప్రచారాల్లో పాల్గొంటారు.ఇది ఎంతో కష్టమైన పని అని నటి కృతిసనన్ అన్నారు. ఓ సినిమా ప్రచారంలో పాల్గొనలేక తాను ఏడ్చినట్లు చెప్పారు. వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం భేడియా.ఈ సినిమాను కృతి ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.భేడియా విడుదల సమయంలో నాకు చేతినిండా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఒకవైపు షూటింగ్‌లలో పాల్గొంటూనే మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్స్‌కు వెళ్లాల్సివచ్చింది. వరుసగా ఇంటర్వ్యూలు, రియాలిటీ షోలకు వెళ్లాం. ఎన్నో ప్రముఖ నగరాల్లో ప్రెస్‌మీట్‌లు నిర్వహించాం. రాత్రంతా ప్రయాణం, పగలంతా ప్రమోషన్లు. ఇంటర్వ్యూల్లో చెప్పిందే చెప్పాం. టేప్ రికార్డర్ ఉంటే బాగుండనిపించింది. ప్రతి ప్రశ్నకు నంబర్ డయల్ చేయగానే ఆన్సర్ వచ్చేలా ఏర్పాటుచేయాలనిపించింది. ఆ సినిమా విశేషాలన్నీ కంఠస్థం చేసుకున్నాం. 'భేడియా' కోసం ఓ రియాలిటీ షోలో పాల్గొనేందుకు సిద్ధం అవుతుండగా అలసటతో నాకు ఏడుపు ఆగలేదు.
దీంతో నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఖంగుతిన్నారు. నటనను ఇష్టపడుతున్నప్పుడు ప్రచారాల్లోనూ కచ్చితంగా భాగం కావాలి. నాకు కొన్నిసార్లు అవార్డు ఫంక్షన్లకు కూడా వెళ్లాలనిపించదు. ఫొటోషూట్‌లలో పాల్గొనాలని లేదని ఒకసారి నా స్టైలిష్‌కు చెప్పాను. ఆమె వెంటనే 'ఫొటోషూట్‌కు వెళ్లకపోతే ఆ దుస్తులు మీరు కొనాల్సి వస్తుంది' అని చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నో షూట్‌లు చేశాను అని కృతి సనన్ చెప్పారు.ప్రస్తుతం కృతి నటిగానే కాకుండా నిర్మాతగానూ విజయాలు అందుకుంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించి నిర్మించిన 'దో పత్తి' నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృతి ద్విపాత్రాభినయంలో కనిపించారు. శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహించారు. 'బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్' పతాకంపై కృతి నిర్మించిన తొలి చిత్రమిది. కవలలైన అక్కాచెల్లెళ్ల గురించిన రహస్యాలను వెలికితీసే పోలీసు అధికారి పాత్రలో కాజోల్ నటించారు. షహీర్‌షేక్, తన్వీ అజ్మీ, బ్రిజేంద్ర కాలా కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ ఏడాది కృతి వ్యాపారరంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.