ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ‘జులాయి, ‘సన్నాఫ్ సత్యమూర్తి , అల వైకుంఠపురములో’ వంటి హిట్లతో ఈ కాంబో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. తాజాగా, భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ చిత్రం గురించి హైప్ తారాస్థాయిలో ఉంది. కానీ, ఈ సినిమా సంగీతానికి ఎవరు ఎంపికవుతారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.త్రివిక్రమ్ సినిమాలకు గతంలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ మ్యూజిక్ అందించిన సందర్భాలు ఉన్నాయి. ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్ అందించగా, ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి తమన్ పనిచేసి బన్నీ కెరీర్‌లోనే ఒక పెద్ద మ్యూజికల్ హిట్‌ను అందించాడు. అయితే ఇటీవల బన్నీ, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో పూర్తి సంతృప్తి చెందలేకపోయినట్లు సమాచారం. ఈ కారణంగా, ఈ ప్రాజెక్ట్‌లో తమన్‌కు అవకాశం వస్తుందా లేదా అనేది అనుమానంగా మారింది.
గతంలో త్రివిక్రమ్ సినిమాల్లో తమన్ ఎలాంటి శ్రద్ధ పెట్టి పని చేశారో అందరికీ తెలిసిందే. అయితే ‘గుంటూరు కారం’ ప్రాజెక్ట్‌లో కొన్ని సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. సాంగ్స్ పరంగా పరవాలేదనిపించినా, BGM విషయంలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయారు. మరి తాజా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు తమన్‌ను తిరిగి తీసుకోవాలనే ఆలోచన ఉంటే, సరిచేయాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. అలాగే పుష్ప 2 కోసం బన్నీ తమన్ తో వర్క్ చేయించినా సంతృప్తి చెందలేదు.అయితే ఈసారి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఉండబోతుండటంతో, కొత్త సంగీత దర్శకుడి కోసం చూస్తారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి బడా సంగీత దర్శకుడిని తీసుకునే ఆలోచన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమన్ తిరిగి ఈ లైన్‌లోకి రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.దీంతో అల్లు అర్జున్ తో చేస్తున్న తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.స్క్రిప్ట్ ఆల్మోస్ట్ పూర్తికావచ్చింది. త్వరలోనే అల్లు అర్జున్ ని కలిసి ఫైనల్ నెరేషన్ ఇస్తారు. బన్నీ ఏమైనా మార్పులు సూచిస్తే.. వాటిపై కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా 2025 సమ్మర్ కి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.