రామ్ గోపాల్ వర్మ, పవన్ అభిమానుల మధ్య మాటల యుద్ధం.. !
రామ్ గోపాల్ వర్మ.. పవర్ స్టార్ సినిమా ఎపుడైతే ప్రకటించాడో.. అప్పటి నుంచే నుంచే వివాదాలు ఆయన్ను చుట్టుముట్టాయి. వివాదాలు ఆర్జీవీకి కొత్తేమీ కాదు. అయితే పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేసేందుకు ఆయన సిద్ధపడుతుండటంతో హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీసుపై కొందరు దాడి చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆఫీస్ సిబ్బంది. మరోవైపు ఆర్జీవి సినిమాకు ప్రతిగా పరాన్న జీవి సినిమాకు రూపకల్పన చేస్తున్నారు పవన్ అభిమానులు.
పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ గోపాల్ వర్మ మధ్య యుద్ధం ముదురుతోంది. హైదరాబాద్ లో దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ ఆఫీసుపై దాడి జరిగింది. జూబ్లిహిల్స్‌లో ఉన్న ఆయన ఆఫీసు మీద కొందరు దాడి చేశారు. పవర్ స్టార్ పేరుతో సినిమా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ తాను ఎవరికీ భయపడబోనని దమ్ముంటే తన ఆఫీసుకు రావాలంటూ ఛాలెంజ్ చేశారు. దీంతో కొందరు యువకులు వర్మ ఆఫీసుకు చేరుకోవడంతో.. అక్కడ గొడవ జరిగింది. ఈ దాడిపై వర్మ ఆఫీసు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ దాడి చేశారని ఆరోపించారు.
రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరుతో ఓ సినిమా తీస్తున్నారు. అయితే, తన సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కాదన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి - గడ్డి తింటావా.. అంటూ ఓ పాటను కూడా రిలీజ్ చేశారు. సినిమా ట్రైలర్ చూడడానికి కూడా 25 రూపాయలు కట్టాలంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు వర్మ. అయితే, ఆ ట్రైలర్ లీక్ అయిందని చెప్పారు. ఈనెల 25న పవర్ స్టార్ సినిమాను ఆర్జీవీ వరల్డ్ ధియేటర్‌లో రిలీజ్ చేస్తున్నట్టు వర్మ ప్రకటించారు.
మరోవైపు వర్మ తీస్తున్న పవర్ స్టార్ సినిమాకు పోటీగా రామ్ గోపాల్ వర్మ మీద సెటైర్ వేస్తూ పరాన్న జీవి అనే సినిమాను పవన్ ఫ్యాన్స్ తీస్తున్నారు. మరోవైపు.. హీరో నిఖిల్.. ఎక్కడా ఆర్జీవి పేరు ప్రస్తావించకుండా.. అభిమాన హీరోకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శిఖరాన్ని చూసి కుక్క ఎంత మోరిగినా..ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్థం అయ్యిందిగా అంటూ నిఖిల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడిన హీరో నిఖిల్ నీ వర్మ వదిలిపెట్టలేదు. నిఖిల్ ఎవడో నాకు తెలియదు.. అని వర్మ సెటైర్ వేశాడు. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉండేవాళ్ళంత ఒక బానిసత్వానికి చెందిన వాళ్ళు అంటూ విమర్శించాడు వర్మ.