ఏజ్ తో సంబంధం లేకుండా జెట్ స్పీడ్ తో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అందులో భాగంగా ఈఏడాది సంక్రాంతి కి పేటతో ప్రేక్షకులముందుకు రాగ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత రజినీ, దర్బార్ అనే చిత్రం లో నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజి లో వున్న ఈచిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. రజినీ-మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దర్బార్ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రంలో రజినీ ,పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా ఆయనకు జోడిగా నయనతార నటించింది. ఇక వీరితో పాటు బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈచిత్రం యొక్క ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది.
ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ , మాస్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో తన 168వ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈరోజు ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీఫిలిం సిటీ లో ప్రారంభమైంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ , మీనా , కుష్బూ , ప్రకాష్ రాజ్ వంటి భారీ స్టార్ క్యాస్టింగ్ నటిస్తుండగా ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. .