జీవిత సత్యాలు: దేవుడు మనకు నోరు ఇచ్చింది 'అందుకు' కాదు...!

నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు మన పెద్దలు. నోరుంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం, గొడవలు పడటం, అవాకులు చెవాకులు పేలడం సరికాదు.  కొందరు అవసరం లేకపోయినా గోరంతలు, కొండంతలు చేసి గొడవలు సృష్టించి అనవసరంగా అందరినీ విసిగించి నోరు పారేసుకుంటారు కొందరు.  వారికి దురుసుగా మాట్లాడందే నోటిదురద తీరదు. ఇది చాలా ప్రమాదకరం.


దేవుడు ఇచ్చిన నోటితో దైవ నామాన్ని పలకాలి, కీర్తించాలి. పది మంది మేలు కోరుకోవాలి. అంతే కానీ..  అనరాని మాటలు మాట్లాడి, నోటికి కల్మషం అంటించరాదు. ఎవరైనా ఎదురుపడితే, ఆత్మీయంగా బాగున్నారా? అని అడిగితే, ఆ ఒకే ఒక్కమాట వల్ల ఇద్దరి మధ్యా ఆత్మీయత ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం ఏర్పడుతుంది. 


అలాగే.. కష్టనష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదరంగా పలకరిస్తే, ఆ మాటలు అతనికి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎవరైనా మనల్ని చక్కగా పలకరిస్తే మనం ఎంత ఆనందిస్తామో, మనం కూడా ఇతరులను అదే విధంగా పలకరించాలి. కాలుజారినా ప్రమాదం లేదు గానీ, నోరు జారితే ఎంతో ప్రమాదం. 


నోరుజారి మనస్సును గాయపరచిన గాయాన్ని మాన్పుట ఎంతో కష్టం. ఎందుకంటే చిరిగిన వస్త్రాన్ని సరిచేయవచ్చునేమో గానీ, విరిగిన మనస్సును సరిచేయటం ఎంతో కష్టం. అందుకే నోటిని అదుపులో పెట్టుకుని  మాట్లాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు జారరాదు. నోటిని అపవిత్రం చేయరాదు. నోటితో మంచి పలుకులే పలకాలి, ఆ పలుకులు ఇంపుగా ఉండాలి. మాట్లాడే మాటలపై మనకు అదుపు ఉండాలి. ఎందుకంటే మాటలలోనే మర్మం ఉంది. మాటలలోనే సర్వం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: