అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది పంజాగుట్ట నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పరిస్థితి. విభాగాలు అందుబాటులో ఉన్న వైద్యులు లేకపోవడంతో ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. దీంతో తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు పొందాలని భావించి ఆస్పత్రికి వచ్చే రోగులకు నిరాశ తప్పడం లేదు. ఏండ్లు గడిచే కొద్ది ఆస్పత్రిలో వైద్య సేవలు పటిష్టంగా మారకపోగా బలహీనమవుతాయి. ఒక్కొక్కటిగా విభాగాలు మూతపడడంతో నిమ్స్ ఖాళీ అవుతోంది. రోగులు ప్రైవేట్ ఆస్పత్రుల బాట పట్టి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. కాగా నిమ్స్ లో ఖాళీల విషయమై డీన్ ను ఫోన్ లైన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. 1500 పడకల సామర్థ్యం గల నిమ్స్ ఆస్పత్రిలో 27 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో కార్పొరేట్ ఆస్పత్రులకు మించి ఇక్కడ సేవలు అందుతాయి.
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ప్రతిరోజు 200-2000 వరకు రోగులు వస్తుంటారు. ఎప్పుడు 170-200 వరకు సర్జరీలు జరుగుతుండేవి. మొత్తం 311 ప్రొఫెసర్, అడిషనల్/ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకుగాను 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సేవలో చిన్న చిన్న లోపాలు ఉన్న పెద్దగా పట్టించుకునేవారు కాదు. కొంత కాలంగా వివిధ విభాగాలపై అధికారుల శీతకన్ను, సర్కార్ పట్టింపు లేమి కారణంగా వైద్య సేవలు దూరమవుతున్నాయి. దాంతో సూపర్ స్పెషాలిటీ వైద్యం పైనే కాకుండా రోగుల చికిత్సలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. వివిధ కారణాలతో చాలా మంది నిపుణులు నిమ్స్ ను వీడారు. అంతర్గత కుమ్ములాటలతో కొంతమంది, ప్రైవేట్ హాస్పిటల్స్ లో భారీ ఆఫర్లు రావడంతో మరికొందరు హాస్పిటల్ ను వీడుతున్నారు. ఏం లేదా కొన్ని విభాగాల్లో వైద్యులు, సిబ్బంది పదవీ విరమణ చేశారు. ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పలు విభాగాలు మూతపడగా..
తాజాగా మరి కొన్ని విభాగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు లేకపోవడంతో రుమటాలజీ, హెమటాలజీ, ఎండోక్రినాలజీ, ప్లాస్టిక్ సర్జరీ సహా పలు చికిత్సలు గగనమయ్యాయి. చర్మ వ్యాధులు, జనరల్ సర్జరీ, గైనకాలజీ, డయాబెటిక్ వంటి కీలక విభాగాలు ఉన్నా.. రోగుల అవసరాలను పూర్తిగా తీర్చలేక పోతున్నాయి. ఖాళీ స్థానాల్లో కొత్తవారిని తీసుకోలేదు. చేరినవారు కొద్దిరోజులకే వెళ్ళిపోతున్నారు. దాంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వైద్యులకు అవకాశం కల్పిస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుంది.