పవన్, బాబు పొత్తు వెనుక అదిరే స్కెచ్‌?

అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చేతులు కలిపారు. తమతో పాటు బీజేపీ కలిసి రావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన అభ్యర్థులు పోటీ చేసే తొలి జాబితాను విడుదల చేశారు. గతంలో విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ లాభ పడిందని.. ఈ సారి ఇద్దరం కలిస్తే తమ కూటమికి తిరుగుఉండదని ఇరు పార్టీల అధినేతలు లెక్కలేసుకుంటున్నారు.

ఏపీలో మొత్తం  175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. వీటిలో టీడీపీని తీసుకుంటే గత ఎన్నికల్లోను.. అంతకు ముందు ఓడిపోయిన అభ్యర్థులకే మెజార్టీ స్థానాలు కేటాయించారు. కొన్ని స్థానాల్లో మాత్రమే కొత్త ముఖాలకు చోటు కల్పించారు. తుని-యనమల దివ్య, కల్యాణ దుర్గం-అమలినేని సురేంద్రబాబు, చింతలపూడి-రోషన్ బాబు, కడప-మాధవి, పులి వెందుల-బీటెక్ రవి, తిరువూరు-కొలికపూడి శ్రీనివాసరావు ఇలా దాదాపు 25 నియోజకవర్గాల్లో కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు.

పాత ముఖాలకు చోటు ఇవ్వడం వెనుక పలు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అవి గతంలో ఓడిపోయిన సానుభూతి, ఆర్థికంగా కేడర్ పరంగా మంచి మార్కులు ఉండటం, క్షేత్రస్థాయిలో జనసేనతో కలిసి పనిచేస్తున్న తీరు. వీటిని ప్రామాణికంగా తీసుకొని ఈసారి సీట్ల కేటాయింపు జరిగినట్లు తెలుస్తోంది.

2019 ఎన్నిక్లలో వైసీపీ ఐదువేల లోపు మెజార్టీతో 12 స్థానాలు గెలుచుకుంది. ఇందులో విజయవాడ సెంట్రల్ -25, తిరుపతి-708, పొన్నూరు-1,12, నెల్లూరు సిటీ-1,988, తణుకు-2195, నగరి-2708తో పాటు కొత్తపేట, ఏలూరు, యలమంచిలి, తాడికొండ, ప్రత్తిపాడు, జగ్గయ్యపేట ఉన్నాయి.  ఈ స్థానాల్లో జనసేన ప్రభావం బాగానే ఉంది. అదే సమయంలో 5-10 వేల లోపు మెజార్టీ తో వైసీపీ గెలిచిన స్థానాలు 22 ఉన్నాయి. అందులో ముఖ్యంగా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి లో వైసీపీకి 5337 ఆధిక్యం వచ్చింది. అలాగే 10-20వేల మెజార్టీతో టీడీపీ ఓడిపోయిన స్థానాలు 35. ఇప్పుడు జనసేనతో టీడీపీ పొత్తు వల్ల ఈ 69 స్థానాల్లో బయటపడొచ్చని అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: