జోరు పెంచాలన్న జగన్.. ఇక దూకుడేనా?

జగన్ ఏపీ సీఎం అయ్యాక విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. నాడు నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందు కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేయిస్తున్నారు. ఇప్పుడు నాడు నేడు రెండో దశ పనులు జరుగుతున్నాయి. ఈ నాడు-నేడు రెండో దశ వేగం పెరగాలని, శరవేగంగా పనులు పూర్తి చేయాలని జ‌గ‌న్ అధికారుల‌ను తాజాగా ఆదేశించారు.

ఈ నాడు నేడు  రెండో దశ కింద దాదాపు 25 వేల స్కూళ్లలో పనులు చేపడుతున్నారు.  రెండో దశ నాడు-నేడు పనుల ద్వారా స్కూళ్లలో గణనీయంగా మార్పులు తీసుకురాబోతున్నారు. అయితే.. ఈ మార్పు ఈ  ఏడాదిలోనే కనిపించాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు-నేడు పనులు చేపట్టాలని సీఎం జగన్ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. నాడు-నేడు పథకాన్ని  చరిత్రలో నిలిచిపోయేలా చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఈ నాడు నేడు రెండోదశ ఖర్చు అంచనా రూ. 11,267 కోట్లుగా ప్రభుత్వం భావిస్తోంది.

ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతి ఇంగ్లిషు మాధ్యమంలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఈ నాడు-నేడు కింద  468 జూనియర్‌ కళాశాలల్లో పనులు చేస్తున్నారు. ప్రతి మండలానికీ 2 జూనియర్‌ కళాశాలలు ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీటిలో ఒకటి అమ్మాయిలకోసం ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి విద్యాకానుకను సర్వం సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు తెరిచే నాటికి వారికి విద్యాకానుక అందించనున్నారు.

ఈ ఏడాదికి విద్యాకానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే మరో రూ.200కోట్లకుపైగా అదనపు ఖర్చు చేయబోతున్నారు. ఈ విద్యాకానుక కోసం ఖర్చు అయినా పర్వాలేదంటున్న సీఎం.. పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలేనని.. వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం జగన్ అంటున్నారు. ఇక నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌ ను అధికారులు ఇటీవలే పూర్తి చేశారు. ఇకపై విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ఈ ఏడాది నుంచి ప్రారంభించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: