శ్రీలంకలో ఎమర్జెన్సీ.. అసలేం జరుగుతోంది?

మన పొరుగున ఉన్న శ్రీలంక ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పరిస్థితులు చక్కబడకపోవడంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఎమర్జెన్సీ విధించారు. శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆయన అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఎమర్జన్సీ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స గెజిట్‌ జారీ చేశారు. శ్రీలంకలో ఇటీవల తీవ్ర అశాంతి నెలకొంది. ప్రజల భద్రత, అత్యవసర సేవలు, నిత్యావసరాల సరఫరా నేపథ్యంలోనే ఈ ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స చెబుతున్నారు.

అసలు శ్రీలంకలో ఏం జరుగుతోంది. అత్యవసర పరిస్థితి విధించే స్థాయికి ఎందుకు దిగజారింది.. ఈ పరిణామాలను పరిశీలిస్తే.. శ్రీలంకలో కొంత కాలంగా ఆ దేశం అమలు చేసిన కొన్ని సంస్కరణలు బెడిసి కొట్టాయి. దీంతో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. అక్కడ కరెన్సీ విలువ రోజురోజుకూ దారుణంగా పడిపోతోంది. దీంతో  నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు, ఆహార పదార్థాల కొరత శ్రీలంక వాసులను ఇప్పటికే దారుణంగా వేధిస్తుండగా.. ఇప్పుడు విద్యుత్‌ కోతలు, ఇంధన కొరత అల్లాడిస్తున్నాయి.

ఏకంగా రోజుకు 15 గంటల వరకూ విద్యుత్ కోత విధిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. పరిస్థితి పీక్స్ కు చేరడంతో గురువారం రాత్రి వేల మంది శ్రీలంక అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. అధ్యక్ష స్థానం నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. భారీ ఎత్తున నిరసనకారులు శ్రీలంక అధ్యక్ష భవనం ముందుకు చేరుకోడవంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. నిరసనకారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో అనేక మంది గాయపడ్డారు. పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో కొలంబోలో పోలీసులు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. పరిస్థితులు చేజారుతున్నట్టు కనిపించడంతో అధ్యక్షుడు రాజపక్స ఎమర్జెన్సీ విధించారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: