హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ..ఎలా తట్టుకుంటాడో ?
కొన్నిసార్లంతే కాలం కలసి రానపుడు దెబ్బ మీద దెబ్బ పడుతునే ఉంటుంది. చంద్రబాబునాయుడు పరిస్దితి చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్ధమైపోతుంది. మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బనుండి కోలుకోలేదు. అలాంటిది ఈమధ్యే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో తగిలిన దెబ్బతో పార్టీ కుదేలైపోయింది. మెల్లిగా కాలుచేయి కూడదీసుకుందామని అనుకుంటుండగానే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వచ్చిపడింది. ఉపఎన్నికలో గెలిచే అవకాశం లేనప్పటికీ పోయిన ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్లు తెచ్చుకుంటే అదే గెలిచినంత సంతోషం అని నేతలే అనుకుంటున్నారు. దీనికోసం రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ మార్గదర్శకంలో ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదంతా ఇలా ఉండగానే హఠాత్తుగా బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నిక రాబోతోంది. రెండు రోజుల క్రితం బద్వేలు ఎంఎల్ఏ డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన డాక్టర్ భానీ మెజారిటితో గెలిచారు. వైసీపీ తరపున పోటీచేసిన డాక్టర్ కు 2019 ఎన్నికల్లో 95482 ఓట్లు వచ్చాయి. టీడీపీ తరపున పోటీ చేసిన ఓబుళాపురం రాజశేఖర్ కు 50748 ఓట్లొచ్చాయి. అంటే వెంకటసుబ్బయ్య టీడీపీ అభ్యర్ధిపై 44,734 ఓట్ల మెజారిటితో గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నపుడే అంత భారీ మెజారిటితో గెలిచిన పార్టీ అభ్యర్ధికి ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే ఉపఎన్నికలో ఇంకెంత మెజారిటి రావాలి. ఏప్రిల్ 17వ తేదీన జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా ఇదే ప్రశ్నను మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలను జగన్మోహన్ రెడ్డి అడిగారు.