హెరాల్డ్ ఎడిటోరియల్ : ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు పనికిరాడా ?

Vijaya
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుపై తెలుగుదేశంపార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తాజాతీర్పు ప్రకారం ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబునాయుడు ఫెయిలయినట్లు జనాలు తీర్మానించేశారు. అందుకనే టీడీపీకి కర్రు కాల్చి వాతలుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ తో పోల్చుకుంటే తాజా ఎన్నికల్లో టీడీపీకి 11 శాతం ఓటింగ్ తగ్గిపోయినట్లు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యే స్వయంగా అంగీకరించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి సుమారు 38 శాతం ఓటింగ్ జరిగితే ఇపుడు 11 శాతం తగ్గింది అంటే 27 శాతానికి పడిపోయింది. టీడీపీకి 11 శాతం ఓటింగ్ తగ్గటమంటే మామూలు విషయం కాదు. ఎందుకింతగా ఓటింగ్ శాతం పడిపోయింది ?



ఎందుకు పడిపోయిందంటే చంద్రబాబు పనితీరును జనాలు మెచ్చలేదని అర్దమైపోతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎలా ఇబ్బంది పెడదామా అని చంద్రబాబు శతవిధాల ప్రయత్నించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాల్లో కొన్నింటిపై  కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా అంటే భారీ వర్షాల వల్ల ఇసుక కొరత, తాజాగా వైజాగ్ స్టీల్స్ ను ప్రైవేటీకరించటం లాంటి అనేక అంశాల్లో జగన్ ఫెయిల్యూర్ గా చూపేందుకు చంద్రబాబు తెగ ప్రయత్నించారు. అలాగే కరోనా వైరస్ పై అవకాశం ఉన్నంతలో ప్రభుత్వం పోరాటమే చేసింది. అయితే జగన్ ఫెయిలయ్యాడని, ముఖ్యమంత్రిగా పనికిరాడని, జగన్ చేతకాని తనం వల్లే రాష్ట్రం వెనకబడిపోతోందని పదే పదే బురద చల్లుతున్నారు. తాను బురద చల్లటమే కాకుండా ఎల్లోమీడియాతో చెప్పి నెగిటివ్ వార్తలు రాయిస్తున్నట్లు జనాలు భావించినట్లున్నారు.



ఇక దేవాలయాలపైన, విగ్రహాలపైన దాడులు అధికారపార్టీ నేతల పనే అని నానా గోల చేశారు. తీరా కొన్ని ఘటనల్లో టీడీపీ నేతల హస్తమే ఉన్నట్లు పోలీసులు ఆధారాలతో సహా తేల్చేశారు. దాంతో నెమ్మదిగానే అయినా విషయం బయటపడింది. ఇలాంటి అనేక అంశాలను తీసుకుంటే ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు విఫలమయ్యారని జనాలు డిసైడ్ చేసుకున్నారు. ఇదే సమయంలో పార్టీలో ఎక్కడికక్కడ నేతల మధ్య గొడవలు, సమన్వయం లేకపోవటం లాంటి అనేక లోపాల కారణంగా టీడీపీ ఘోరంగా దెబ్బతినేసింది. రాష్ట్రచరిత్రలోనే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అధికారపార్టీని జనాలు దాదాపు 98 శాతం ఆధరించటం ఇదే మొదటిసారి. మరి జనాల తీర్పును చంద్రబాబు హుందాగా తీసుకుని విశ్లేషించుకుంటే పార్టీ బాగుపడుతుంది లేకపోతే అంతే సంగతులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: