నేతల కెపాసిటి అన్నది సమస్యలు వచ్చినపుడు వాటిని పరిష్కరించటంలోను, అందులోనుండి సేఫ్ గా బయటపడటంలోను తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి కూడా నిజమైన సమస్య అంటే పరీక్ష ఇపుడే మొదలైంది. గడచిన ఏడాదిన్నరకు పైగా రాజకీయంగా వచ్చిన చిన్నా చితకా సమస్యలను ఎదుర్కోవటం వేరు ఇపుడు ఎదురైన సమస్యను డీల్ చేయటం వేరు. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ రూపంలో పెద్ద సమస్య వచ్చి కూర్చుందనే చెప్పాలి. తనపాటికి తాను ఉక్కును ప్రైవేటీకరించబోతున్నట్లు కేంద్రం ప్రకటించేసి చేతులు దులిపేసుకుంది. ఆ తర్వాత మొదలైన ఆందోళనల రూపంలో పరీక్ష మొదలైంది జగన్ కే. తొందరలోనే పరిపాలనా రాజధానిగా వైజాగ్ కు వెళదామని డిసైడ్ అయిపోయిన జగన్ గనుక ఇపుడు ఉక్కు ప్రైవేటీకరణను ఆపకపోతే పెద్ద మైనస్ అవుతుంది. ఉక్కు ప్రైవేటీకరణలో జగన్ పాత్ర తక్కువే. అయినా ప్రైవేటీకరణ బురదను జగన్ కు అంటించేందుకు చంద్రబాబునాయుడు అండ్ కో తెగ ప్రయత్నిస్తున్నారు. ఇందులో నుండి బయటపడాలంటే జగన్ చాలా గట్టిగా ఉండకతప్పదు.
రాజధానిని విశాఖకు తరలించాలని ఒకవైపు జగన్ ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ఉక్కు ప్రైవేటీకరణను కేంద్రం ప్రకటించటం పెద్ద ఇబ్బందిగా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోడితో మాట్లాడుతారో లేకపోతే అమిత్ షాతో చెప్పుకుంటారో జనాలకు అనవసరం. జనాలు చూసేదేమంటే ఉక్కు ప్రైవేటీకరణ ఆగిందా లేదా అన్నదే. ప్రైవేటీకరణ ఆగితే జగన్ హీరో అవుతారు. ఒకవేళ ఆపలేకపోతే మాత్రం పెద్ద మైనస్ గా మిగిలిపోతుంది. విశాఖకు రాజధానిని మార్చి, ఉక్కు ప్రైవేటీకరణను కూడా ఆపగలిగితే యావత్ ఉత్తరాంధ్రలో జగన్ కు హీరో వర్పిప్ వచ్చేస్తుంది. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం ఇప్పటికే జగన్ ఇటు కేంద్రంతో పాటు అటు పోస్కో ప్రతినిధులతో కూడా మాట్లాడారట.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల గురించి పూర్తిగా వివరించారని సమాచారం. ఉక్కు పరిశ్రమవెనుక జనాల సెంటిమెంట్ కూడా ముడిపడుంది. దాన్నే జగన్ ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఒకవేళ క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం, పోస్కో ముందుకెళితే జరగబోయే పరిణామాలను కూడా వివరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాంతో పోస్కో ప్రతినిధులు పునరాలోచనలో ఉన్నదంటున్నారు. అందుకనే జగన్ కూడా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాదని, పోస్కో విశాఖపట్నంలోకి అడుగుపెట్టదని ధీమాగా చెప్పారని వైసీపీ వర్గాలంటున్నాయి. మరి జగన్ ఏమవుతారో తొందరలోనే తేలిపోతుంది.