మొత్తానికి వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ఎల్లోమీడియా చాలా కష్టపడుతున్నట్లు అర్ధమైపోతోంది. ఆదివారం రాసిన చెత్తపలుకులో ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతోంది. ఈనెల 9వ తేదీన షర్మిల పార్టీ ఏర్పాట్లు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి-షర్మిల మధ్య విభేదాలు తీవ్రస్ధాయిలో పెరిగిపోయాయట. తొమ్మిదేళ్ళు పార్టీ కోసం కష్టపడిన తనను చివరకు పార్టీలోనే లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని షర్మిల తెగ బాధపడిపోతోందట. షర్మిలను పార్టీలో నుండి బయటకు పంపేయాలనే కుట్రను స్వయంగా జగన్ భార్య భారతిరెడ్డే చేస్తున్నట్లు షర్మిల తనకు సన్నిహితులతో చెప్పుకుని తెగ బాధపడిపోయినట్లు ఎల్లో మీడియా యజమాని ఆర్కేకి తెలిసిపోయింది.
జగన్ నుండి షర్మిలను దూరం చేయటానికి 2011లోనే కుట్ర జరిగిందట. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కుటుంబం కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చేసిన తర్వాత సోనియాగాంధి నుండి షర్మిలకు ఫోన్ వచ్చిందట. కాంగ్రెస్ పార్టీతో చేయికలిపితే ముఖ్యమంత్రి పదవి ఇస్తానని సోనియా ఆఫర్ చేసినట్లు షర్మిల తన బంధువుల దగ్గర ప్రస్తావించారట. సోనియా తనకు ఫోన్ చేసిన విషయం జగన్+విజయమ్మకు కూడా తెలుసట. అయితే తానే ఆఫర్ ను తిరస్కరించారట.
ఇక్కడ ఒక సందేహం ఏమిటంటే ముఖ్యమంత్రి పదవిని షర్మిలకు ఆఫర్ చేసేబదులు జగన్నే సీఎం చేసుంటే సరిపోయేది కదా ? అప్పుడు జగన్ కూడా కాంగ్రెస్ ను వదిలుండే వారు కాదు, జగన్ పై కేసులూ ఉండేవికాదు కదా ? ఏ రకంగా చూసుకున్నా షర్మిలకన్నా జగన్ స్ట్రాంగ్ అన్న విషయం మొదటి నుండి అందరికీ తెలిసిందే. బలవంతుడైన జగన్ను కాదని షర్మిలకు సీఎం పోస్టును సోనియా ఎందుకు ఆఫర్ చేస్తుందబ్బా ? ఎక్కడో లాజిక్ తేడా కొట్టేయట‌్లేదూ.
అన్నింటికన్నా విచిత్రమేమిటంటే అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు ముదురుతున్న విషయం తెలుసుకున్న పార్టీలోని కొందరు ముఖ్యనేతలు షర్మిలను కలిశారట. తెలంగాణాలోనే కాదు ఏపీలో కూడా పార్టీ పెట్టమని బతిమలాడుకుంటున్నారట. జగన్ వ్యవహార శైలి నచ్చని ఎంఎల్ఏలు కూడా షర్మిలను కలిస్తున్నారట. విచిత్రమేమిటంటే చెల్లెలు విషయంలో జగన్ వైఖరి పట్ల కేసీయార్ కూడా తీవ్ర అసహనంగా ఉన్నట్లు టీఆర్ఎస్ ముఖ్యనేత ఒకళ్ళు ఎల్లోమీడియా ఎండీకి చెప్పారట. మొత్తానికి జగన్ పై తనకున్న కసి, అక్కసునంతా షర్మిలను అడ్డం పెట్టుకుని ఎల్లోమీడియా బాగానే తీర్చుకుంటోంది.